Anantapuram Police: మంచినీళ్లు అడుగుతాడు, ఇంతలోనే ఇల్లును గుల్ల చేసేలా చోరీకి స్కెచ్ వేస్తాడు
అనంతపురం జిల్లా కేంద్రంలో పెరిగిపోతున్న చోరీలు పోలీసులను పరుగులు పెట్టించాయి. జిల్లా కేంద్రంలో ఈ మధ్య పట్టపగలే చోరీ జరగడం మరింత ఆందోళన కలిగించింది. దీన్ని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి

అనంతపురం(Anantapuram) జిల్లా కేంద్రంలోని రజాక్ ఫంక్షన్ హాల్ వెనుకవైపు ఉన్న ఇంటిలో ఈ మధ్య కాలంలో చోరీ జరిగింది. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలిని టార్గెట్ చేసుకున్న దొంగ... ఆమెను బెదిరించి మెడలోని బంగారం లాక్కెళ్లిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసిన పోలీసులు కేసును ఛేదించి కొత్త విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు.
షేక్ ఖాజా పీరా అనే 28 సంవత్సరాల యువకుడు ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీకి చెందిన ఖాజా ప్రస్తుతం గుత్తి రోడ్డులోని బాగ్యనగర్‌లో ఉంటున్నాడు. పెయింటింగ్ పని చేసుకొని బతికే ఖాజా.. మద్యానికి అలవాటు పట్టాడు. ఇతర చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి. ఈ కారణంతో అప్పులు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడ్డాడు.
ఖాజీ దొంగతనాలు ప్రారంభించి 50 రోజులై అవుతుందని పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు 8 చోరీలకు పాల్పడినట్టు వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లు, ఒంటరిగా ఉండే వాళ్ల ఇళ్లనే ఇతరని టార్గెట్. రెక్కీ నిర్వహించి.. తాగేందుకు నీళ్లు కావాలని అడుగుతాడు. వాళ్లు నీళ్లు తీసుకొచ్చే లోపు ప్లాన్ చేసుకొని వాళ్లను కొడవలితో బెదిరించి విలువైన ఆభరణాలు, వస్తువులు ఎత్తుకెళ్లాడం ఇతని స్టైల్ చోరీ.
ఈనెల 11 న స్థానిక రజాక్ ఫంక్షన్ హాల్ వెనుకనున్న ఓ ఇంట్లో వృద్ధురాలిని తాగేందుకు నీళ్లు అడిగి ఆమె నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన సందర్భంలో కొడవలి చూపించి బంగారు చైను లాక్కెళ్లాడు. ఈనెల 26 న కూడా పామిడిలోని ఓ ఇంట్లో మహిళను బెదిరించి దొంగతనానికి పాల్పడ్డాడు. వీటితోపాటు స్థానిక నాయక్ నగర్ , ప్రశాంతినగర్, పాపంపేట, సిండికేట్ నగర్, తపోవనం, వివేకానందనగర్‌లో కలిపి మొత్తం 8 చోరీలు చేశాడు.
పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఖాజాను అరెస్టు చేశారు. ఇతని నుంచి 38.23 తులాల బంగారు ఆభరణాలు, 2 టి.వి లు, పల్సర్ బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని త్వరగా కేసును ఛేదించినట్టు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.
అనంతపురంలో చోరీలు ఎక్కువైపోవడంతో డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి పర్యవేక్షణలో బృందాలు ఏర్పడి నిఘా పెట్టాయి. అలా నిఘా ఉంచినప్పుడే ఖాజా చిక్కాడు. ఇతన్ని కట్టకిందపల్లి సమీపంలో అరెస్టు చేసి రూ. 20 లక్షల విలువ చేసే విలువైన సొత్తులు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

