Peddapalli Rajiv Road Accidents : పెద్దపల్లి రాజీవ్ రహదారిపై తరచూ ప్రమాదాలు, నిర్లక్ష్యం ఎవరిదీ?
Peddapalli Rajiv Road Accidents : పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై మార్కింగ్, పార్కింగ్ కు అవకాశం లేకపోవడం వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు.
Peddapalli Rajiv Road Accidents : రవాణాకు కీలకమైన రాజీవ్ రహదారిపై టూ వీలర్ల నుంచి పెద్ద పెద్ద కంటైనర్లు మోసుకెళ్లే లారీల వరకు వెళ్తాయి. ప్రధాన రహదారి కావడంతో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంటున్నాయి. పెద్దపల్లి మండలం పెద్ద కాల్వల సమీపంలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే రోడ్డు పైనే డీసీఎం వ్యాన్ ని నిలిపి ఉంచడంతో అతి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం వెనకనుండి బలంగా ఢీకొంది.
మధ్యప్రదేశ్లోని బాలాగట్ జిల్లాకి చెందిన హాలశ్రం సేతుపతి(43) మరో ఐదుగురు యువకులతో కలిసి లేబర్ పనుల కోసం వాహనాన్ని రెంటుకు తీసుకొని హైదరాబాద్ కి బయలుదేరారు. దాదాపుగా 14 గంటల పాటు వరుసగా ప్రయాణం చేస్తూ వచ్చిన వీరు రాజీవ్ రహదారిపై ఆగిఉన్న డీసీఎంని అతి వేగంగా ఢీకొనడంతో సేతుపతి, ఛత్రం(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ హేమచంద్ర (21) మార్గమధ్యంలో చనిపోయాడు. మిగతావారంతా కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మార్కింగ్, పార్కింగ్ రెండూ లేవు
నిజానికి ఇంత పెద్ద రహదారిపై ఎక్కడా కూడా మార్గమధ్యలో పెద్ద వాహనాలు నిలిపి ఉంచడానికి స్థలాలు కేటాయించలేదు. సాధారణంగా రహదారుల నిర్వహణ సంస్థలు 100 అడుగుల విస్తీర్ణం కలిగిన రహదారులపై మార్కింగ్ తో బాటు పక్కనే దూరప్రయాణాలు చేస్తున్న వాహనాల కోసం పార్కింగ్ కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా రోడ్లని నిర్మించి వినియోగిస్తూ ఉండడంతో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక పెద్ద వాహనాలు సైతం ఎలాంటి సైడ్ సిగ్నల్స్ వేయకుండా పార్కింగ్ చేయడంతో వేగంగా వచ్చే వాహనాలు వీటిని చీకట్లో గుర్తించలేక ఢీకొంటున్నాయి.
ఆ ప్రాంతాల్లో అధిక ప్రమాదాలు
సుల్తానాబాద్ బసంత నగర్ లాంటి రద్దీ అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాహనాలు చెడిపోవడంతో చాలామంది డ్రైవర్లు భారీ వాహనాలను రోడ్డుపక్కనే నిలిపివేస్తున్నారు. దీంతో భారీ వాహనాలను రోడ్డుపైనా నిలిపివేస్తున్నారు. పార్కింగ్ లేకపోవడంతో ప్రమాదాలకు దారి తీస్తోంది. సుదూరం ప్రయాణం చేసే వాహనాల డ్రైవర్లు నిద్రమత్తులో జారుకోవడం కూడా ప్రమాదాలకు మరో కారణం. కనీసం వాహనాన్ని కొద్ది సేపు పక్కన పెట్టే అవకాశం ఉంటే పార్కింగ్ కోసం డ్రైవర్లు ప్రయత్నిస్తారు కానీ అలాంటి అవకాశం ఎక్కడ లేకపోవడంతో వారు ఎంత దూరమైన వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. అధికారులు ఇప్పటికయినా స్పందించి రానున్న రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.