Pak Terror Attack: పాకిస్తాన్‌లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి- నలుగురు చిన్నారులు మృతి, 38 మందికి గాయాలు
Terror Attack In Pakistan | పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో స్కూల్ బస్సు లక్ష్యంగా చేసుకుని ఆత్మహత్యా దాడి జరిగింది. నలుగురు స్కూల్ విద్యార్థులు చనిపోయారు.

Pakistan School Bus Terror Attack: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. తాజాగా కొందరు ఉగ్రవాదులు స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని సూసైడ్ బాంబు పేల్చారు. బలూచిస్తాన్‌లోని ఖుజ్దార్‌లో జరిగిన సూసైడ్ బాంబర్ చేసిన దాడిలో నలుగురు పిల్లలు చనిపోగా, మరో 38 మంది గాయపడ్డారు. అధికారిక సమాచారం ప్రకారం, వ్యక్తి ఒక స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగింది.
పాకిస్తాన్ వార్తా వెబ్‌సైట్ డాన్ ప్రకారం.. స్కూల్ బస్సు జీరో పాయింట్ దగ్గర వెళ్తోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి బాంబులతో వచ్చి పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో స్కూల్ బస్సు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయాలైన వారిని క్వెట్టా, కరాచీ ఆసుపత్రులకు తరలించారు. పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నక్వి ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. స్కూల్ విద్యార్థులకు లక్ష్యంగా చేసుకుని చేసిన ఆత్మాహుతి దాడికి సంబంధించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు.
దేశానికి వ్యతిరేకంగా కుట్ర - మొహ్సిన్ నక్వి
పాకిస్తాన్ గృహశాఖ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. సూసైడ్ బాంబు దాడిలో చనిపోయి పిల్లల కుటుంబాలకు మంత్రి మొహ్సిన్ నక్వి సంతాపం, ప్రగాఢ సానుభూతి తెలిపారు. శత్రువులు అమాయక చిన్నారులను బలిగొన్నారని, దేశంలో అస్థిరతను సృష్టించే దుష్ట కుట్ర జరుగుతోంది. దేశంలో అశాంతి సృష్టించేందుకు కొన్ని గ్రూపులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. దోషులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
ఖుజ్దార్ జిల్లాలో ఓ బస్సు నగరంలోని సైనిక పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.




















