NTR District News: పీఎస్ భవనం పెచ్చులూడిపడి కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు!
NTR District News: ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ స్టేషన్ భవనం పెపెచ్చులు ఊడి ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే సీఐ కుమార్తె కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.
NTR District News: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయం భవనం పైపెచ్చులు ఒక్కసారిగా ఊడి కింద పడ్డాయి. అదే సమయంలో కింద ఉన్న ఓ కానిస్టేబుల్ కు, సీఐ కూతురుకు గాయాలు అయ్యాయి. అయితే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కాగా.. సీఐ కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. పాఠశాలకు పండుగ సెలవు కావడంతో సోమవారం సీఐ ఎల్ రమేష్ తన నాలుగేళ్ల కుమార్తె మోక్షితను తీసుకొని ఉదయం కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం మధ్య గదిలో కానిస్టేబుళ్లతో పాటు సీఐ కుమార్తె కూర్చున్నారు. అదే సమయంలో కానిస్టేబుల్ జమలయ్య కూర్చున్న ప్రాంతంలో స్లాబ్ నుంచి సీలింగ్ ను చీల్చుతూ పెద్ద పెద్ద పెచ్చులు ఊడి పడటంతో ఆయన తలపై పడ్డాయి. ఒక్కసారిగా రక్తం చిమ్మి తీవ్ర గాయాలయ్యాయి.
అలాగే పక్కనే ఉన్న సీఐ కూతురు మోక్షిత కూర్చున్న కుర్చీపై కూడా పడటంతో బాలికకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ఇద్దరినీ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. గతంలో స్థానిక బస్టాండు పక్కన పోలీస్ స్టేషన్ ఉండేది. మూడున్నరేల్ల కిందట కొత్త భవనాన్ని నిర్మించి పోలీస్ స్టేషన్ ను తరలించారు. బస్టాండ్ పక్కనున్న స్టేషన్ భవనానికి తాత్కాలిక మరమ్మతు చేయించి సీఐ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. గతంలోనే శ్లాబ్ పాడవడంతో తాత్కాలిక మరమ్మతు చేయించారు. భవనం దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి ఖాళీ చేస్తామని సీఐ రమేష్ తెలిపారు.
కొద్ది నెలల క్రితం బడి భవనం కూలి..
రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తుంది. అయితే కొన్ని చోట్ల ఇంకా పరిస్థితులు మారలేదు. ఇంకా విద్యార్థులు శిథిలావస్థ భవనాల్లోనే చదువులు సాగిస్తున్నారు. ఇలాంటి భవనాల్లో పైకప్పులు పడి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలో స్లాబు పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఇద్దరి విద్యార్థులకు తీవ్రగాయాలు
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలోని పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. మండల ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో స్లాబు పెచ్చులు ఊడిపడి ఇద్దరికి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. 2వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ క్లాస్ రూమ్ లో ఉండగా ఒక్కసారిగా సీలింగ్ పై కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో తరగతి గదిలో ఉన్న సఫాన్, అరీఫ్ విద్యార్థుల తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరిందని ఎన్నో సార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికైనా పాఠశాలను మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తల్లిదండ్రులు ఆగ్రహం
"పిల్లలు రెండు మూడు సార్లు చెప్పారు. ఇలా పెచ్చులు పడిపోతున్నాయి. మేం ఉపాధ్యాయులకు చెప్పాం. పిల్లలు ఎక్కువ లేరని చూద్దాంలే అన్నారు. పాఠశాల పైకప్పు సరిగ్గా లేదు. పెచ్చులు పడిపోయాయి. ఇప్పుడు పిల్లల ప్రాణాల మీదుకు తెచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాం. " అని స్థానికులు అంటున్నారు.