Somireddy Comments On Kakani: మంత్రి పదవి ఊడిపోతుందనే ఆధారాలు లేపేశారు, కాకాణిపై సోమిరెడ్డి సంచలన ఆరోపణ
నెల్లూరు కోర్టులో దొంగలు పడి కీలక సాక్ష్యాధారాలను దొంగిలించిన వ్యవహారంలో కాకాణిపై తమకు అనుమానాలున్నాయని, ఆయనే సాక్ష్యాధారాలను మాయం చేసి ఉంటారని ఆరోపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
నెల్లూరు 4వ అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగలు పడి కీలక సాక్ష్యాధారాలను దొంగిలించిన వ్యవహారంలో కాకాణిపై తమకు అనుమానాలున్నాయని, ఆయనే సాక్ష్యాధారాలను మాయం చేసి ఉంటారని ఆరోపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ కేసు మరో నెలలో న్యాయస్థానం ముందు విచారణకు రాబోతోందని, ముద్దాయిలకు శిక్ష పడుతుందని తమకు పూర్తి నమ్మకముందని అన్నారు సోమిరెడ్డి. అంతలోనే కాకాణి ఈ పని చేయించారని ఆరోపించారు. శిక్ష పడితే జైలు ఊచలు లెక్కపెట్టడంతో పాటు మంత్రి పదవి ఊడటం ఖాయమని భావించి తనను కాపాడుకునేందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో ఉన్న డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, నాలుగు సెల్ ఫోన్లను మాయం చేయించేశారని అన్నారు సోమిరెడ్డి.
నెల్లూరు కోర్టులో సాక్ష్యాలు దొంగతనం చేశారనే విషయం వెలుగులోకి రావడం, కాకాణిపై సోమిరెడ్డి వేసిన కేసులో కొన్ని సాక్ష్యాలు బయటపడిపోయి ఉండటంతో.. నేరుగా సోమిరెడ్డి రంగంలోకి దిగారు. సాక్ష్యాలు మాయం కావడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నెల్లూరులోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఆయన విచారణ వేగవంతం చేయాలని కోరారు. టీడీపీ నేతలతో కలసి సోమిరెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.
అసలేంటి ఈ కేసు..
2017లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయంటూ అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్ష్యాలుగా కొన్ని డాక్యుమెంట్లను కూడా మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అయితే ఆ డాక్యుమెంట్లన్నీ తప్పుడు పత్రాలని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తనపై ఆరోపణలు చేశారంటూ సోమిరెడ్డి పరువునష్టం దావా వేశారు. నకిలీ పత్రాల ముఠాతో కాకాణి చేతులు కలిపి తమ కుటుంబాన్ని దెబ్బతీయాలని కుట్ర చేశారంటూ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసుతో పాటు సివిల్ డిఫర్మేషన్, క్రిమినల్ డిఫర్మమేషన్ దావాలు కూడా వేశారు. రెండు నెలల్లోనే నకిలీ డాక్యుమెంట్ల వెనకున్న కుట్రను పోలీసులు చేధించారు. నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసిన ఫొటో స్టూడియోను గుర్తించి ఆధారాలను కూడా సీజ్ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఏ-1 గా కాకాణి పేరు చేర్చారు. అప్పట్లో కాకాణి సుప్రీం కోర్టునుంచి కండిషనల్ బెయిల్ తెచ్చుకున్నారు.
తాజా పరిస్థితి ఏంటి..?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉన్న ఈ కేసును మూడు నెలల క్రితం ఉపసంహరించుకుంటూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ కేసును ఉపసంహరించుకోవడం కుదరదని రాష్ట్రప్రభుత్వానికి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. దీంతో కేసు విచారణ కొనసాగుతోంది. త్వరలో ఈ కేసులో తుది తీర్పు వస్తుందని, కాకాణికి శిక్ష పడుతుందని నమ్మకంగా చెబుతున్నారు సోమిరెడ్డి. అంతలోనే కోర్టులో సాక్ష్యాల దొంగతనం జరగడాన్ని తీవ్రంగా పరిగణించాలని అంటున్నారాయన. అప్పట్లో నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, మెసేజ్ లు, ఇతర ఆధారాలన్నీ ఉన్న ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను లేపేశారని అంటున్నారు సోమిరెడ్డి.
దేశ చరిత్రలోనే తొలిసారి జరిగిన ఇలాంటి ఘటనకు సంబంధించి ముద్దాయిలకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులో భద్రంగా ఉండాల్సిన ఫైళ్లకే దిక్కులేకపోతే ఇక సాక్షుల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. విచారణ ప్రారంభమయ్యే సమయానికి సాక్షులను లేపేసినా ఆశ్చర్యం లేదని అన్నారు సోమిరెడ్డి. సాక్ష్యాలు మాయం అయిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.