Doctor Murder Case: నెల్లూరులో డాక్టర్ ని హత్య చేయించిన మరో డాక్టర్ - ప్రొఫెషనల్ జలసీ ఎంత పని చేసింది !
సంధానీ భాషాని హత్య చేయాలంటూ డాక్టర్ మునిప్రకాష్, సుబ్రహ్మణ్యం అనే ఆటో డ్రైవర్ కి చెప్పాడు. అతడు తిరుపతినుంచి ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ని తీసుకొచ్చాడు. వారిద్దరినీ వెంకటగిరి లాడ్జిలో ఉంచాడు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఇటీవల ఓ ఆర్ఎంపీ డాక్టర్ హత్య సంచలనంగా మారింది. వివాద రహితుడు, అందరితో కలుపుగోలుగా ఉండే ఆ డాక్టర్ ని ఎవరు, ఎందుకు చంపారనే విషయం పోలీసులకు కూడా అంతు చిక్కలేదు. చివరకు అసలు కారణం తెలుసుకుని పోలీసులే విస్తు పోయారు. డాక్టర్ సంధానీ భాషాని చంపించింది మరో డాక్టర్ అని తెలుసుకుని నిర్ఘాంతపోయారు.
అసలేం జరిగిందంటే..?
వెంకటగిరి పట్టణానికి చెందిన సంధాని భాష మంచి డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారు. అయితే ఆయన లైమ్ లైట్లోకి రావడంతో అప్పటికే ఆర్ఎంపీగా ఉన్న సత్రం గ్రామానికి చెందిన డాక్టర్ మునిప్రకాష్ కి బిజినెస్ పడిపోయింది. ఆయన దగ్గరకు పేషెంట్లు ఎవరూ రావడం లేదు. దీంతో అతను చాన్నాళ్లుగా సంధానీ భాషాపై కక్ష పెంచుకున్నాడు. అతనితో చాలాసార్లు రాజీపడాలని చూశాడు. బిజినెస్ పంచుకుందామని, తన వద్దకు కూడా కొందరు పేషెంట్లను పంపించే ఏర్పాటు చేయాలని ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోడానికి పథకం పన్నాడు. చివరకు హత్య చేయించాడు.
హత్య ఎలా చేయించాడంటే..?
సంధానీ భాషాని హత్య చేయాలంటూ డాక్టర్ మునిప్రకాష్, సుబ్రహ్మణ్యం అనే ఆటో డ్రైవర్ కి చెప్పాడు. అతడు తిరుపతినుంచి ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ని తీసుకొచ్చాడు. వారిద్దరినీ కొన్నాళ్లపాటు వెంకటగిరి లాడ్జిలో ఉంచాడు. వారుప్రతిరోజూ రెక్కీ నిర్వహించేవారు. వారితోపాటు ఇంకొందరు అదే లాడ్జీలో హత్యకు పథక రచన చేశారు. చివరకు ఓరోజు సంధానీభాషా ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రాత్రివేళ కాపుకాసి కత్తులతో పొడిచి హత్య చేశారు. డాక్టర్ హత్య సంచలనంగా మారింది. అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇటీవల వెంకటగిరికి వచ్చిన వారి గురించి ఆరా తీశారు. తిరుపతినుంచి ఇద్దరు వచ్చారని, హత్య జరిగిన తర్వాతి రోజు నుంచి వారు కనపడటం లేదని సమాచారం రావడంతో వారిపై నిఘా పెట్టారు. వారిని వెంకటగిరికి తీసుకొచ్చినవారి గురించి ఆరా తీశారు. సుబ్రహ్మణ్యం పోలీసులకు చిక్కాడు. మొత్తం వ్యవహారం చెప్పాడు.
2 లక్షలు సుపారీ..
సందానీ భాషాను హత్య చేస్తే 2 లక్షల రూపాయలు ముట్టజెబుతానంటూ ప్రకాష్ బేరం కుదుర్చుకున్నాడు. హత్యకు ముందు వారికి 25వేల రూపాయలు అప్పజెప్పాడు. హత్య జరిగిన రోజు రాత్రి మరో 50వేలు ఇచ్చి పంపించాడు. మిగతా మొత్తం హంతకులకు ఇచ్చేలోపు ముఠా పోలీసులకు చిక్కింది. వెంకటగిరి పట్టణ ఎస్సై జిలాని భాష ఆధ్వర్యంలో డక్కిలి, బాలాయపల్లి పోలీస్ సిబ్బంది అన్ని కోణాల్లో విచారణ జరిపి హంతకుల్ని, వారికి సహకరించినవారిని అరెస్ట్ చేసారు. మొత్తం 10మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. హత్య కేసులో ముద్దాయిలను త్వరగా పట్టుకున్నందుకు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డ వారికి రివార్డ్ ప్రకటించారు. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆ రివార్డుని పోలీసులకు అందజేశారు.
ప్రొఫెషనల్ జలసీతోనే ఈ హత్య జరిగిందని చెప్పారు డీఎస్పీ. కిరాయి హంతకులు వెంకటగిరిలో చెలరేగిపోయారు అని తెలిసే సరికి ప్రజలు షాకయ్యారు. పేదలకు తక్కువ ఫీజుతో వైద్యం చేస్తూ, అప్పుడప్పుడూ దారి ఖర్చులకు కూడా డబ్బు ఎదురిచ్చి పంపించే మంచి డాక్టర్ సంధానీ భాషా చనిపోవడం బాధాకరం అంటున్నారు వెంకటగిరి ప్రాంత ప్రజలు.