Nellore Crime News : నెల్లూరు జిల్లాలో క్రైమ్ లవ్ స్టోరీ, మాజీ లవర్ హత్యకు కిలేడీ కారు ప్లాన్, కానీ చివరికి?
మాజీ లవర్ వేధింపులకు పాల్పడుతున్నాడని అతడిని హత్య చేసుందుకు కాబోయే భర్తతో హత్యాయత్నం ప్లాన్ చేసింది. కారుతో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించాలని చూసింది కానీ సీన్ రివర్స్ అయ్యి పోలీసులకు చిక్కింది.
Nellore Crime News : సినిమా క్రైమ్ స్టోరీలను తలదన్నే ఓ రియల్ లైఫ్ క్రైమ్ కథ ఇది. ఇందులో లవ్ స్టోరీ కూడా మిక్స్ అవడం మరో విశేషం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఓ స్కూటీని కారు ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న వ్యక్తికి కాలు విరిగింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులకు ఆ ప్రమాదంపై అనుమానం కలిగింది. కారు డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అసలు కథేంటని ఆరా తీశారు. తీరా అది ఓ హత్యాయత్నం అని తేలేంది. తనకు కాబోయే భార్య కోసం ఆమె మాజీ లవర్ ని హత్యచేయబోయి పోలీసులకు అడ్డంగా దొరికేశాడు రెహ్మాన్ అనే యువకుడు. అతడితో కలసి తన మాజీ లవర్(Former Lover) ని హత్యచేయాలని చూసి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతోంది ప్రియురాలు ఆసిఫా.
క్రైమ్ లవ్ స్టోరీ
ఆసిఫా, నజీర్ ఇద్దరూ ఆత్మకూరులోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేసేవారు. ఆమె స్టాఫ్ నర్స్, అతడు కంప్యూటర్ ఆపరేటర్. ఇద్దరికీ మాటలు కలిశాయి, మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దలు అంగీకరించలేదు. చివరికి విడిపోయారు. కానీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఆసిఫా కావలికి చెందిన అలీం అనే వ్యక్తిని పెళ్లాడింది. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇది. అయితే అలీంతో ఆమె కాపురం సజావుగా సాగలేదు. వెంటనే విడిపోయారు. విడాకులు తీసుకున్నారు.
కారుతో ఢీకొట్టి హత్యాయత్నం
అలీంతో విడిపోయిన తర్వాత ఆసిఫా మరో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇటీవలే ఆమెకు రెహ్మాన్ అనే యువకుడితో నిశ్చితార్థం అయింది. ఇక్కడే ఆసిఫా ఫస్ట్ లవర్ నజీర్ ఎంట్రీ ఇచ్చాడు. నజీర్ దగ్గర ఆసిఫా ఫోన్ చాటింగ్, వాట్సప్ చాటింగ్ అన్నీ ఉన్నాయి. వాటిని డిలీట్ చేయడానికి ఓ ఒప్పందానికి వచ్చారు. రెహ్మాన్ కి కూడా ఈ విషయం ముందే చెప్పింది ఆసిఫా. అయితే నజీర్ తనను వేధిస్తున్నాడని, అతడిని హత్య చేయాలని ఉసిగొల్పింది. ఈ క్రమంలో ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్ద నజీర్ తో మాట్లాడి ఫోన్ లోని వాట్సప్ చాటింగ్ డిలీట్ చేయించుకుంది ఆసిఫా. ఆ తర్వాత రెహ్మాన్ తన కారుతో నజీర్ ని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. నజీర్ వెళ్లే స్కూటీని ఢీకొట్టాడు. పోలీసులకు ఆ ప్రమాదం వెనక బలమైన కారణం ఉందనే అనుమానం వచ్చింది. రెహ్మాన్ ని నిలదీయడంతో తడబడ్డాడు. ఆ తర్వాత అసలు విషయం ఒప్పుకున్నాడు. ఆసిఫా కూడా తప్పు ఒప్పుకుంది. చివరకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.