యువకుడ్ని చంపి రీల్స్‌కు ఫోజులిచ్చిన బ్యాచ్ - హైదరాబాద్‌లో భయంకర హత్యా దృశ్యం
Hyderabad News: ఓ వ్యక్తిని చంపేశారు. అదే చేతులతో సోషల్ మీడియాలో రీల్స్ చేశారు. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన సంచలనంగా మారుతోంది.
Telangana Crime News: వెబ్‌సిరీస్‌లు, సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పే ఓ భయంకరమైన ఘటన ఇది. చట్టం, పోలీసులు, న్యాయస్థానాలు అనే భయం ఏ మాత్రం లేని ఓ బ్యాచ్... హత్యలు చేసి దర్జాగా సోషల్ మీడియాలో రీల్స్ చేసి పెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన ఇటు పోలీసులను, అటు నగర ప్రజలను వణికిస్తోంది.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారణం జరిగింది. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన యువకులు... రక్తంతో తడిసిన చేతులతో రీల్స్ చేశారు. ప్రగతినగర్ బతుకమ్మ కుంట వద్ద ఓ యువకుడిని ప్రత్యర్థులు హత్య చేశారు. తమతో పెట్టుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందనే హెచ్చరిక చేసేలా ఇన్‌స్టా రీల్స్ చేశారు.
సిద్దు అనే యువకుడిని ఇంటి నుంచి అర్థారాత్రి బలవంతంగా తీసుకొచ్చారు కొందరు యువకులు. ఇతను కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. హత్య కేసుల్లో ఇరుక్కొని రెండు నెలల క్రితమే జైలుకు వెళ్లి వచ్చాడు. అతన్ని రాత్రి బయటకు లాక్కొచ్చిన ఈ బ్యాచ్... అతి కిరాతకంగా హత్య చేసింది.
అనంతరం రక్తం తడిసిన చేతులు, పొడిచిన కత్తితో ఇన్‌స్టా రీల్స్ చేశారు. ప్రత్యర్థులకు హెచ్చరికలు చేస్తూ... తమ జోలికి వస్తే ప్రాణాలు ఉండబోవని వార్నింగ్ ఇస్తూ రక్తంతో తడిసిన చేతులు, చేతిలో ఉన్న చాకు చూపిస్తూ రీల్స్ చేశారు. చివర్లో తమ ఫేస్‌లు కూడా చూపించారు. హైదరాబాద్ నగరంలోని రోడ్లపై షికార్లు చేస్తూ డ్యాన్స్‌లు కూడా చేస్తూ కనిపించారు.