Mulugu News: నీళ్లు తాగిన వెంటనే 24 మంది కూలీలకు అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం
Mulugu Crime News: మంచి నీళ్లు తాగిన వెంటనే 24 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ములుగు జిల్లాలో ఘటన జరిగింది.
Telangana News: వారంతా వ్యవసాయ కూలీలు. పొలం పనులు చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ మంచి నీళ్లు తాగిన వెంటనే కూలీలు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 24 మంది వరకు అస్వస్థతకు లోనుకాగా, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడులో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడేనికి చెందిన కొందరు రోజులాగే వ్యవసాయ కూలీ పనికి వెళ్లారు. గ్రామానికి చెందిన రైతుకు చెందిన మిర్చి తోటలో కూలీ పనికి 24 మంది వెళ్లారు. పని మధ్యలో మధ్యాహ్నం భోజనం చేయడానికి విరామం తీసుకున్నారు. ఈ క్రమంలో పక్కన రైతు పొలంలో ఉన్న పంపు వద్ద నీటిని తీసుకువచ్చారు. ఆ నీటిని తాగిని కొంత సమయానికే కూలీలు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు. కొందరు వాంతులు చేసుకోగా, మరికొందరికి కళ్లు తిరిగి పడిపోయారు. ఇంకొందరికి వికారం లాంటి లక్షణాలు కనిపించాయి.
ఏం జరిగిందని ఆరాతీయగా.. కూలీలు అస్వస్థతకు గురికావడానికి కారణం తెలిసింది. పక్క పొలం రైతు పైపులను శుభ్రం చేసేందుకు ఓ రకం యాసిడ్ తెచ్చి వినియోగించారు. పాస్ఫారిక్ యాసిడ్ తో డ్రిప్ పైపులు శుభ్రం చేశారు. వాటి నుంచే నీళ్లు రాగా, వీటిని తాగేందుకు తీసుకురాగా, కూలీలు భోజన సమయంలో తాగేశారు. అనంతరం కూలీలు అస్వస్థతకు లోనుకాగా, వారిని చికిత్స నిమిత్తం వెంకటాపురంలోని ఆసుపత్రికి తరలించారు. మెడికల్ సిబ్బంది కూలీలకు ప్రాథమిక వైద్యం అందించారు. అయితే అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మిగతా వ్యవసాయ కూలీల ఆరోగ్యం నిలకడగానే ఉందని, వారికి ఏ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.