నల్గొండలో యువతిపై దాడి చేసిన ప్రేమోన్మది రోహిత్ అరెస్ట్
నల్గొండ జిల్లాలో నిన్న(మంగళవారం) ఓ అమ్మాయిపై దాడి చేసిన ప్రేమోన్మాది మీసాల రోహిత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్‌కు తరలించారు.
నల్గొండ జిల్లాలోని ఫారెస్ట్ పార్కులో నిన్న(మంగళవారం) మధ్యాహ్నం ఓ అమ్మాయిపై హత్యాయత్నం చేశాడో యువకుడు. ఈ కేసులో నిందితుడు మీసాల రోహిత్ ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. యువకుడు అమ్మాయిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడని వివరించారు. గతంలో కూడా నిందితుడు ఆమెను చంపేస్తానని సీసాతో బెదిరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈకేసును వ్యక్తిగతంగా తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణలోని షీ టీంలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని.. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్కుంటామని చెప్పారు.
అసలేమైందంటే..?
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ పార్కులో మంగళవారం మధ్యాహ్నం ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు యువకుడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న అతడు కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రోహిత్ (21) అనే యువకుడు నల్గొండలోని ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. ఇతను గత ఏడు నెలల నుంచి జిల్లా కేంద్రంలోని పానగల్ ప్రాంతానికి చెందిన నవ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె స్థానిక ఎన్జీ కళాశాలలో బీబీఏ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. వీరిద్దరూ ముందు ఒకే తరగతిలో ఉండే వాళ్లు. కానీ రోహిత్ సరిగ్గా చదవకుండా, పరీక్షల్లో ఫెయిల్ అవడంతో సెకండ్ ఇయర్ లోనే ఉండిపోయాడు. రోహిత్ తన స్నేహితుడు సాయి ద్వారా ఫోన్ చేయించి ఫారెస్ట్ పార్కులు రావాలంటూ కోరాడు. అయితే అందుకు ఒప్పుకున్న నవ్య తన స్నేహితురాలు శ్రేష్ఠను కూడా వెంట తీసుకెళ్లింది. సాయితోపాటు నవ్యను సతాయిస్తున్న రోహిత్ కూడా అక్కడకు చేరుకున్నాడు.
వెంట తెచ్చుకున్న కత్తితో పదే పదే దాడి..
నవ్యతో రోహిత్ కొద్ది సేపు మాట్లాడాలి అంటూ నవ్యను పక్కకి తీసుకెళ్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో నవ్యపై విచక్షణరహితంగా కడుపు, చేతులు, కాళ్లు, మొహంపై పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే కొద్ది దూరంలో ఉన్న సాయి, శ్రేష్ఠ కలిసి నవ్యను పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆస్పత్రికి తీసుకెళ్లిన స్నేహితులు..
రోహిత్ గతంలో కూడా అమ్మాయిని చాలా సార్లు బెదిరింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. కానీ నిన్న కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఎనిమిది చోట్ల నవ్యకు గాయాలు అయ్యాయని.. వాటికి ఆపరేషన్ చేయాలని వైద్యలు వివరించారు. ప్రస్తుతానికి ప్రాణపాయం ఏమీ లేదన్నారు. గతంలోనే ఒకసారి రోహిత్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నవ్య, ఆమె సోదరుడు రోహిత్ వేధింపులపై ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు ఇకపై యువతి జోలికి రాడని రోహిత్ తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. అయినా రోహిత్ వేధింపులు మాత్రం ఆగలేదు. చివరికి యువతిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. అయితే రోహిత్.. నవ్యపై దాడి చేస్తాడనే విషయం తమకు నిజంగానే తెలియదని స్నేహితులు సాయి, శ్రేష్ఠ వివరించారు.