మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగిపై కస్టమర్ దాడి,ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు
McDonalds Worker Attacked: అమెరికాలో మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లోని వర్కర్‌పై కస్టమర్ దాడి చేయడం వల్ల ఆమె తలకు తీవ్ర గాయమైంది.
McDonalds Teen Worker Attacked: అమెరికాలో మెక్‌డొనాల్డ్స్ వర్కర్‌పై ఓ కస్టమర్ దారుణంగా దాడి చేశాడు. 15 ఏళ్ల ఆ బాలిక జుట్టు పట్టుకుని లాగి తలపై గట్టిగా కొట్టాడు. ఈ దాడితో ఆమె స్పృహ కోల్పోయింది. స్కల్ ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆమెకి వైద్యం అందిస్తున్నారు. అక్కడి సీసీ కెమెరాలో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పార్కింగ్ ఏరియాలో గొడవ జరగగా ఆ కోపంలోనే ఆ బాలిక జుట్టు పట్టుకుని ఈడ్చాడు నిందితుడు. పదేపదే తలపై కొట్టాడు. ఫలితంగా ఆమె తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఏప్రిల్ 7వ తేదీన ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...నిందితుడు మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ట్రేని గట్టిగా విసిరాడు. ఈ విషయంలో సిబ్బందితో గొడవ జరిగింది. ఈ గొడవ పార్కింగ్ ఏరియా వరకూ వచ్చింది. నిందితుడి అనుచరులు కొందరు అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా ఆ బాలికని పట్టుకుని కింద పడేసి కొట్టాడు నిందితుడు. ఆమె తలకి బలమైన గాయం అయింది. ఆ బాలిక కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక విరాళాల కోసం చూస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
"నా కూతురితో పాటు మరికొందరిపైనా ఆ దుండగులు దాడి చేశారు. స్టోర్‌లోని సామగ్రినీ ధ్వంసం చేశారు. వాళ్ల నుంచి తప్పించుకోడానికి తను చాలా ప్రయత్నించింది. కానీ ఆ వ్యక్తి మరింత తీవ్రంగా దాడి చేశాడు"
- బాధితురాలి తల్లి