Guntur: 3 నెలల చిన్నారిని 6 సార్లు అమ్మేశారు! అసలు సంగతి తెలిసి అవాక్కైన పోలీసులు
Mangalagiri: ఒక పాప ఏకంగా 6 సార్లు అమ్మకానికి గురైంది. ఈ లావాదేవీల్లో ఏకంగా 10 లక్షల వరకూ చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు.
పేదరికం ఒకవైపు, నిరక్షరాస్యత మరోవైపు.. వెరసి పలువురిని అమానవీయ పనులకు పురిగొల్పేలా చేస్తోంది. కానీ, కొంత మంది అత్యాశతో కూడా తలదించుకొనే పనులకు పాల్పడేలా చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ ఘటన. డబ్బుల కోసం 3 నెలల చిన్నారిని ఏకంగా ఆరు సార్లు వేర్వేరు వ్యక్తులకు అమ్మిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఘటన జరిగింది. దీనికి కారకులైన 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వారు తెలిపిన వివరాలు ఇవీ.. మంగళగిరి పట్టణంలోని గండాలయపేట ప్రాంతానికి చెందిన దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మూడో కూతురు ఇటీవలే పుట్టింది. చెడు అలవాట్లకు అలవాటు పడ్డ వీరి తండ్రి తన చివరి కూతూరు మూడు నెలల చిన్నారిని రూ.70 వేలకు అమ్మేశాడు. విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న అతని అత్త పిడతల మేరీ ప్రకాశం జిల్లా చీరాలలోని సమాధుల రోడ్డులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు నిర్ఘాంతపోయారు.
ఈ పాపను వీరు మరో 5 సార్లు అమ్మినట్లుగా గుర్తించారు. ఈ లావాదేవీల్లో ఏకంగా 10 లక్షల వరకూ చేతులు మారినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మనోజ్‌తో పాటు మరో 11 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించారు. ఈ 3 నెలల పాపని వరసగా నల్గొండ, హైదరాబాద్, ఏలూరు, విజయవాడలో అమ్మినట్లు గుర్తించారు. మొదట తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండప్రోలుకి చెందిన దంపతులకి శిశువు తండ్రి రూ.70 వేలకు అమ్మాడు. వారు గాయత్రి భూక్యా నందుకు లాభం చూసుకొని రూ.1.20 లక్షలకు విక్రయించారు. వీరు ఇంకా లాభం చూసుకొని షేక్ నూర్జహాన్ అనే మహిళకు రూ.1.87 లక్షలకు అమ్మారు.
ఈమె నుంచి బొమ్మాడ ఉమాదేవి రూ.1.90 లక్షలకు బిడ్డను కొనుక్కుంది. ఆమె విజయలక్ష్మి అనే మరో మహిళకు ఏకంగా రూ.2.20 లక్షలకు అమ్మింది. ఆమె నుంచి వర్రే రమేష్ అనే వ్యక్తి రెండున్నర లక్షలకు కొన్నది. మొత్తంగా చిన్నారి విక్రయం ద్వారా రూ.10.37 లక్షలు చేతులు మారాయి. చివరికి పోలీసులు విజయవాడకు చెందిన వర్రే రమేష్ వద్ద శిశువు ఉన్నట్లు తెలుసుకొని స్వాధీనం చేసుకొని తన తల్లికి అప్పగించారు.
ఈ కేసులో నిందితులు నాగలక్ష్మి, గాయత్రి, బుక్యా నందు, బుక్యా బలవర్ధిరాజునాయక్, షేక్ నూర్జహాన్, అనుగోజు ఉదయకిరణ్, ఉమాదేవి, పడాల శ్రావణి, విజయలక్ష్మి, వర్రె రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. వీరందరికీ ఎస్పీ రివార్డులు ఇచ్చారు.