Man Suicide Attempt: భార్య తన పిల్లల్ని చూడనివ్వట్లేదంటూ పీఎస్ ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Man Suicide Attempt: భర్తపై అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను కూడా ఆ తండ్రిని చూడనివ్వలేదు. దీంతో తీవ్ర మనోవేదన చెందిన అతడు పోలీసు స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Man Suicide Attempt: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య తన పిల్లల్ని తనకు చూపిండ లేదని ఆరోపిస్తూ.. పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. స్పందించిన పోలీసులు ఆయనతో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది.
అసలేం జరిగిందంటే..?
జిల్లాలోని పుల్లంపేట మండలానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి.. తన భార్య తన పిల్లల్ని చూడనివ్వడం లేదంటూ రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. బాధితుడు వేణుగోపాల్ రెడ్డి జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు దుబాయ్ ఎయిర్ పోర్టులో సొమ్మసిల్లి పడిపోయి కోమాలోకి వెళ్లాడు. ఇంటికి వచ్చి కాస్త బాగయ్యాక భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఆతడి భార్య శోభారాణి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తండ్రి పిల్లలను చూసేందుకు ఆమె ఉన్న చోటుకు వెళ్తున్నా వారిని చూడనివ్వడం లేదని వేణుగోపాల్ రడ్డి ఆరోపిస్తున్నాడు. స్కూల్ వద్ద కూడా తండ్రి పిల్లలను కలుసుకోకుండా చేస్తోందని చెబుతున్నాడు. అంతేకాకుండా భర్త తమను వేధిస్తున్నాడంటూ రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని.. ఈ క్రమంలోనే పోలీసులు తన పాస్ పోర్టు తీసుకున్నారని వివరిస్తున్నాడు.
పిల్లలను చూసేందుకు మళ్లీ వచ్చా.. కానీ
కేవలం పిల్లలను కలుసుకోవాలనే ఆశతోనే తాను మళ్లీ రైల్వే కోడూరు వచ్చాడు. ఇప్పుడు కూడా భార్య తన పిల్లలను చూపించకపోవడంతో ఆవేదన చెందిన వేణు గోపాల్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకోబోయాడు. పెట్రోల్ బాటిల్ తెచ్చుకొని మరీ ఒంటిపై పోసుకున్నాడు. విషయం గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగి అతడి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే పిల్లల్ని చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు వేణుగోపాల్ రెడ్డికి పిల్లలను చూపించారు.
వేణుగోపాల్ రెడ్డి బాధ చూడలేక.. దంపతులకు కౌన్సిలింగ్!
ఈ విషయంపై సీఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. వేణు గోపాల్ రెడ్డి, శోభా దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. ఈ క్రమంలోనే భర్తపై భార్య ఫిర్యాదు చేసిందని తెలిపారు. రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నడుస్తోందన్నారు. కానీ సోమవారం సాయంత్రం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ విషయాన్ని మా సిబ్బంది ద్వారా తెలుసుకొని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నట్లు తెలపారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతీ శుక్రవారం తండ్రి వేణుగోపాల్ రెడ్డి తన పిల్లలను చూసుకునేలా శోభారాణిని ఒప్పించినట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. దీంతో వేణు గోపాల్ రెడ్డి సీఐ విశ్వనాథ రెడ్డికి ధన్యవాదాలు తెలిపాడు. పిల్లలను చూడకుండా ఉండలేకపోతున్నానని.. తన బాధ అర్థం చేసుకొని సమస్య తీర్చినందుకు రుణపడి ఉంటానంటూ తెలిపాడు.
Also Read: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు - ఒకేసారి దేశవ్యాప్తంగా 30 చోట్ల