Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు - ఒకేసారి దేశవ్యాప్తంగా 30 చోట్ల
ఒక్క హైదరాబాద్ లోనే ఆరు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లైతో సహా మరో ఐదుగురి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో ఈ సోదాలు సాగుతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే ఆరు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో సహా మరో ఐదుగురి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై సోదాలు చేస్తున్నారు. రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడులు కొనసాగుతున్నాయి.
మంగళవారం ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. సోదాలు జరుపుతున్న విషయాన్ని ఈడీ ప్రధాన కార్యాలయ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. రాబిన్ డిస్ట్రిలర్స్ పేరుతో అరుణ్ రామచంద్రన్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరుతో పాటు హైదరాబాద్‌లో రామచంద్రన్ కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామచంద్రన్‌కు సంబంధించిన కంపెనీతో పాటు ఇంట్లో కూడా ఈడీ దాడులు చేపట్టింది.
అయితే, ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇంట్లో దాడులు చేయడం లేదని ఈడీ వర్గాలు చెప్పాయి. మద్యం వర్తకులు ఉండే ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, జోర్‌బాగ్‌లోని ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రుకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. ఆయన యూసీఓ బ్యాంకు నుంచి రూ.కోటి బదిలీ చేశారని ఈడీ ఆరోపిస్తోంది.