Parcel Fraud: ఫోన్ ఆర్డర్ చేశాడు, పార్శిల్ ఓపెన్ చేస్తే షాక్ - మామూలుగా లేదుగా!
Parcel Fraud: కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో ఓ వ్యక్తి ఫోన్ ఆర్డర్ చేశాడు. కానీ డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్ ను ఎంతో ఆతృతగా విప్పి చూసి షాకయ్యాడు. ఎందుకుంటే అందులో వచ్చింది ఫోన్ కాదు.. చెత్త పేపర్లు.
Parcel Fraud: ప్రతి చోటా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడా, అక్కడా అనే భేదం లేదు. దొరికిన చోటల్లా, అందినకాడికి వెనకేసుకోవాలనే చూస్తున్నారు మోసగాళ్లు. చాలాసార్లు అమాయకులను, కొన్ని సార్లు తెలివైన వారినీ కూడా బుట్టలో పడేస్తూ ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధాలుగా మోసాలను కొనసాగిస్తున్నారు. వీటి నుండి ఎలా తప్పించుకోవాలన్న విజ్ఞతను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాల్సి వస్తోంది.
పార్శిల్ ఫ్రాడ్ అంటే ఇదే..!
ఓ వ్యక్తి ఆన్ లైన్ ఈ- కామర్స్ సైట్ లో ఏదో ఒక వస్తువు ఆర్డర్ చేస్తాడు. సమయానికి పార్శిల్ ఇంటికి వస్తుంది. ఎంతో ఆత్రుతగా పార్శిల్ విప్పితే మాత్రం అందులో ఇటుకలు, సబ్బులు, చెత్త పేపర్లు ఇలా పనికిరాని వస్తువులు ఉంటాయి. దీనిని పార్శిల్ ఫ్రాడ్ అంటున్నారు. ఫోన్, టీవీ, బ్యాటరీలు, ఛార్జర్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయినా, ఇతర వస్తువులు అయినా.. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తుంటారు చాలా మంది. దీనినే అవకాశంగా మలుచుకుంటున్నారు మోసగాళ్లు.
ఫోన్ ఆర్డర్ చేస్తే చెత్త పేపర్లు..!
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన రాంసాని శ్రీను అనే యువకుడి ఫోన్ కు జులై 28న గుర్తు తెలియని నంబరు నుండి ఓ లింకు వచ్చింది. ఆ లింకుపై క్లిక్ చేశాడు రాంసాని శ్రీను. అది కాస్త ఓ ఈ- కామర్స్ వెబ్ సైట్ కు తీసుకు వెళ్లింది. అందులో ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కనిపించాయి. ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. రూ. 20 వేలకు పైగా ఉండే ఐఫోన్ ఆ సైట్ లో రూ.4 వేలకే వస్తోంది. దానిని చూసి ఆ ఆఫర్ లో ఫోన్ ఆర్డర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు రాంసాని శ్రీను. తాను కొనాలనుకున్న ఫోన్ ఆర్డర్ చేసి మిగతా వివరాలన్నీ నమోదు చేశాడు.
మంగళవారం డెలివరీ బాయ్ వచ్చి పార్శిల్ ఇచ్చాడు. తన రూ. 4 వేల ఐఫోన్ వచ్చిందని ఎంతో ఆత్రుతగా ఆ పార్శిల్ ను తెరచి చూసి కంగుతిన్నాడు. అందులో ఐఫోన్ లేదు, వేర్ ఫోన్ కూడా లేదు, కనీసం ఛార్జర్ కూడా రాలేదు. ఆ పార్శిల్ లో చిత్తు కాగితాలు మాత్రమే ఉన్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాంసాని శ్రీను ఆ పనికిరాని కాగితాలు చూసి బిత్తెరపోయాడు.
డెలివరీ బాయ్ ను పట్టుకున్న గ్రామస్థులు..
రాంసాని శ్రీను ఫోన్ ఆర్డర్ చేస్తే చిత్తు కాగితాలు వచ్చాయని ఆ గ్రామస్థులకు తెలిసింది. ఆ డెలివరీ బాయ్ ను వారంతా కలిసి పట్టుకున్నారు. పార్శిల్ ఫ్రాడ్ పై డెలివరీ బాయ్ ను గట్టిగా నిలదీశారు. తనకు ఏం తెలియదని, ఆయా కంపెనీల ద్వారా వచ్చే వస్తువులను తాము సరఫరా చేస్తామని డెలివరీ బాయ్ చెప్పాడు. పార్శిల్ లో వచ్చిన వాటితో ఏదైనా ఇబ్బంది ఉంటే కంపెనీతోనే మాట్లాడుకోవాలని చెప్పాడు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు అనడంతో బాధితుడి నుండి కంపెనీకి లెటర్ రాయించుకున్నాడు డెలివరీ బాయ్. అనంతరం తిరిగి డబ్బులు చెల్లించాడు.