చిలుక జోస్యం కాదు- సాక్ష్యం చెప్పింది- నిందితులకు శిక్ష పడింది
తొమ్మిదేళ్ల క్రితం ఓ హత్య జరిగింది. మృతురాలి పెంపుడు చిలుక సహకారంతో పోలీసులు కేసును పరిష్కరించారు. న్యాయస్థానం నిందితులకు జీవిత ఖైదు విధించింది.
Parrot Witness Case : డబ్బు పట్ల వ్యామోహంతో బంధాలు,బంధుత్వాన్ని మరచిపోతూ మనుషులు మృగాలుగా మారుతుంటే.. తనను అపురూపంగా పెంచిన యజమానురాలి పట్ల తన ప్రేమను.. కృతజ్ఞతను చాటుకుంది ఒక పెంపుడు పక్షి. తన యజమానురాలిని చంపిన హంతకుడిని పట్టించింది పెంపుడు రామచిలుక. ఆగ్రాకు చెందిన ఒక ప్రముఖ వార్తాపత్రిక చీఫ్ ఎడిటర్ విజయ్ శర్మ భార్య నీలం శర్మ తొమ్మిదేళ్ల క్రితం అంటే.. ఫిబ్రవరి 20, 2014న తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురైంది. ఆమెతో పాటు వారి పెంపుడు కుక్కను కూడా హంతకులు పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి హత్య చేశారు. హత్య తర్వాత నీలం ఇంటిలో చోరీ జరిగింది. అయితే హత్యకు గల కారణాలను.. నిందితుడిని పోలీసులు గుర్తించలేదు.
ఆగ్రాకు చెందిన విజయ్ శర్మ తన కొడుకు రాజేష్, కుమార్తె నివేదితతో కలిసి ఫిరోజాబాద్‌లో ఫిబ్రవరి 20, 2014న ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఆ సమయంలో నీలమ్ ఇంట్లోనే ఉండిపోయింది. విజయ్ అర్థరాత్రి తిరిగి ఇంటి వచ్చి కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నాడు. ఆయన భార్య నీలమ్ తమ ఇంట్లోనే హత్యకు గురైంది. ఆమెతో పాటు వారి పెంపుడు కుక్కను కూడా నిందితులు పదునైన ఆయుధంతో దారుణంగా పొడిచి హతమార్చినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆ సమయంలో ఈ కేసులో కొంతమందిని అనుమానితులుగా భావించిన పోలీసులు విచారించారు. అయితే, సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు. దీంతో ఆ కేసు అలాగే పెండింగ్‌లో ఉండిపోయింది. దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు హత్య జరిగిన రోజు నుంచి విజయ్ శర్మ పెంపుడు చిలుక ప్రవర్తనలో తేడా వచ్చింది. సరిగా తిండి తనడం మానేసింది.
విజయ్ శర్మకు అషు అనే మేనల్లుడు ఉన్నాడు. అతను అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చేవాడు. నీలమ్ శర్మ హత్య జరిగిన తరువాత ఎప్పుడు అషు వచ్చినా… అతన్ని చూసి చిలుక విపరీతంగా అరుస్తుండేది. విజయ్ శర్మకు చిలుక ప్రవర్తనతో అషుపై అనుమానం కలిగింది. నీలమ్‌ను హత్య చేసిన నిందితులను చిలుక చూసిందేమో అని అతను సందేహించాడు. ఈ విషయాన్ని విజయ్ శర్మ పోలీసులకు తెలిపాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గతంలో అనుమానితులుగా ఉన్నవారితో పాటు అషును కూడా చిలుక ముందు నిలబెట్టారు. అప్పుడు కూడా అది అతన్ని చూసి విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. దీంతో విజయ్ శర్మ అనుమానం, పోలీసుల సందేహం తీరిపోయాయి. వెంటనే అషును అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.
పోలీసుల విచారణలో అషు తన స్నేహితుడు రోనీ మాస్సే సహాయంతో నీలమ్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. డబ్బు, నగలకోసం తామే హత్య చేసినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు ఛార్జి షీట్ తయారు చేశారు. అయితే, ఈ చార్జిషీట్లో పోలీసులు చిలుక వాంగ్మూలాన్ని ప్రస్తావించలేదు. చిలుకను కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత ఆ మూగప్రాణి ప్రాణాలు వదిలింది. కాగా.. 9 ఏళ్ల తర్వాత ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది. నిందితులకు రూ.72,000 జరిమానా విధించింది.