అడిగిన వెంటనే టీ ఇవ్వలేదని వాగ్వాదం, భార్య తల నరికి చంపిన భర్త
Crime News: అడిగిన సమయానికి టీ ఇవ్వలేదన్న కోపంతో ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి తన భార్య తల నరికి చంపాడు.
Crime News in Telugu:
ఘజియాబాద్‌లో ఘటన..
ఘజియాబాద్‌లోని భోజ్‌పుర్ గ్రామంలో దారుణం జరిగింది. అడిగిన టైమ్‌కి టీ ఇవ్వలేదన్న కోపంతో భార్య తల నరికేశాడో భర్త. కత్తితో మెడపై వేటు వేశాడు. ఈ ఘటనలో 52 ఏళ్ల మహిళ మృతి చెందింది. టీ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలోనే విచక్షణ కోల్పోయి కత్తితో నరికేశాడని పోలీసులు వెల్లడించారు. టీ తీసుకురావాలని నిందితుడు భార్యని అడిగాడు. కాస్త ఆలస్యమవుతుందని ఆమె బదులు చెప్పింది. ఈ విషయంలోనే ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ సమయంలో నలుగురు పిల్లలూ తమ గదిలో నిద్రపోతున్నారు. కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. నేరుగా మెడపై వేటు వేశాడు. ఈ వేటుకి బాధితురాలు గట్టిగా కేకలు పెట్టి కింద పడిపోయింది. ఆమె కేకలు విని చుట్టుపక్కల వాళ్లు పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
"నిందితుడు, బాధితురాలి మధ్య టీ విషయంలో గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. టీ ఆలస్యంగా ఇస్తానని ఆమె చెప్పింది. దీంతో ఆగ్రహం ఆపుకోలేక పదునైన ఆయుధంతో వెనక ఆమెపై దాడి చేశాడు. అది నేరుగా మెడకి బలంగా తాకింది. ఆ ధాటికి ఆమె అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది"
- పోలీసులు