న్యాయం జరగడం లేదన్న అసహనంతో వేలు కత్తిరించుకున్న బాధితుడు, ప్రభుత్వంపై నిరసన
Maharashtra Crime: మహారాష్ట్రలో ఓ వ్యక్తి తనకి న్యాయం జరగడం లేదన్న అసహనంతో వేలు కత్తిరించుకున్నాడు.
Maharashtra Crime:
మహారాష్ట్రలో ఘటన..
న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగీ తిరిగీ అలిసిపోయిన ఓ వ్యక్తి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ తన వేలుని కత్తిరించుకున్నాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జరిగిందీ ఘటన. తన తమ్ముడితో పాటు అతని భార్య ఆత్మహత్య చేసుకునేలా కొందరు ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ నిందితులపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశాడు 43 ఏళ్ల ధనంజయ్ ననవరే. కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తూనే తన వేలుని కత్తిరించుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుకపోతే వారానికి ఓ అవయవాన్ని ఇలాగే కత్తిరించుకుంటానని చెప్పాడు ధనంజయ్. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఫల్తాన్ టౌన్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెల థానే జిల్లాలోని ఓ టౌన్‌లో నందకుమార్ ననవరేతో పాటు అతని భార్య ఉజ్వల ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు ధనంజయ. చనిపోయే ముందు తన తమ్ముడు ఓ మంత్రి పేరు చెప్పాడని, కచ్చితంగా ఆయన ఒత్తిడి వల్లే వీళ్లు ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఆరోపిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకూ ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నాడు. న్యాయం జరిగే వరకూ ఇలా తన శరీరాన్ని కత్తిరించుకుని ఒక్కో అవయవాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని హెచ్చరించాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన వేలుని చూపించాడు. ఇది చూసిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యల కేసులో విచారణ కొనసాగుతోందని, కచ్చితంగా నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.