Machilipatnam News : బైక్ పై బాలుడి మృతదేహం తరలింపు, అధికారుల తీరుపై విమర్శలు!
Machilipatnam News : మచిలీపట్నం బీచ్ లో ఎనిమిదో తరగతి విద్యార్థి గల్లంతు అయ్యాడు. సోమవారం అతడి మృతదేహాం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. బాలుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లడం చర్చనీయాంశం అయింది.
Machilipatnam News : మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో ఆదివారం ఓ విద్యార్థి గల్లంతు అయ్యాడు. విద్యార్థి మృతదేహం సోమవారం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అయితే మృతదేహాన్ని బయటకు తీసేందుకు అధికారులు సహకరించలేదు. అంతే కాదు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయకపోవటంతో విద్యార్థి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. మేనమామ తన మేనల్లుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లడంపై స్థానికంగా చర్చ జరుగుతుంది.
అసలేం జరిగింది?
మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో గూడూరు జడ్పీ హైస్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి నవీన్ ఆదివారం గల్లంతయ్యాడు. నవీన్ మృతదేహాన్ని బందరు మండలం పెద్దపట్నం శివారు సముద్ర తీరాన పోలీసులు గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున సత్రవపాలెం బీచ్ ఒడ్డుకు బాలుని మృతదేహం కొట్టుకొచ్చింది. మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన నవీన్ (14) ఆదివారం తన స్నేహితులతో కలిసి బీచ్ కి వెళ్లాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అలల మధ్య చిక్కుకుని కొట్టుకుపోయిన నవీన్, సోమవారం తెల్లవారు జామున విగత జీవిగా కనిపించాడు. నవీన్ మరణ వార్తతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. బందరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
కార్తీక పౌర్ణమి ముందు రోజే అపశృతి
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు ప్రారంభానికి ముందే అపశృతి చోటు చేసుకుంది. మంగినపూడి బీచ్ లో 8వ తరగతి విద్యార్థి గల్లంతు అయ్యాడు. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ (14) గూడూరు జడ్పీ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావటంతో సముద్ర స్నానాలు ఆచరించేందుకు తన స్నేహితులతో కలిసి బీచ్ కు వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఉక్కిరిబిక్కిరైన నవీన్ గల్లంతయ్యాడు. గల్లంతైన నవీన్ కోసం మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో విద్యార్థి గల్లంతైనట్టు స్థానికులు చెబుతున్నారు.
సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే పేర్ని నాని
బాలుడు గల్లంతు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పేర్ని నాని బీచ్ వద్దకు చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన నవీన్ స్నేహితులతో మాట్లాడి ఎలా గల్లంతయ్యాడనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు గాలింపు చర్యలు చేపట్టినా నవీన్ ఆచూకీ తెలియరాలేదు. సమయాభావం కావటంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే తెల్లవారే సరికి బాలుడి మృతదేహాం బయటపడటంతో అప్పటికి పోలీసులు, అధికారులు విధులకు హాజరుకాలేదు. దీంతో వేరే దిక్కులేక, మేనమామ బాలుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాల్సి వచ్చింది.
వరుస ఘటనలపై స్పందించని అధికారులు
మంగినపూడి బీచ్ వద్ద భద్రతా వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో సముద్రంలో గుంతలు ఏర్పడి స్నానాలకు అనుకూలంగా లేకుండాపోయిందంటున్నారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి ఈ నెల 8వ తేదీన అయినప్పటికీ ముందు రోజు ఆదివారం, ఆ తరువాత కార్తీక సోమవారం కావటంతో భక్తులు వేలాదిగా బీచ్ కు వచ్చారు. సముద్రంలో ఎక్కువ లోతుకి ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు లేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో సెలవుల్లో సరదాగా గడిపేందుకు వచ్చినవారు అలల తాకిడికి గల్లంతయ్యి, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. ప్రధానంగా పౌర్ణమి సమయంలో అలలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటప్పుడు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా, చర్యలు లేకపోవటం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు అంటున్నారు.
బైక్ పై తరలింపు అవాస్తవం- పోలీసులు
ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. గొడుగు పేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ తన స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి మంగినపూడి బీచ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో అలల ఉద్ధృతికి సముద్రంలో కొట్టుకుపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న రాబర్ట్ సన్ పేట ఇన్‌స్పెక్టర్, బందరు తాలూకా, ఆర్ పేట ఎస్ఐలు, మెరైన్ ఎస్ఐ, సిబ్బంది బీచ్‌లో గాలింపు చర్యలుచేపట్టారు. బాలుడు గల్లంతైన సమాచారం తల్లిదండ్రులకు తెలియజేశారు. చీకటి పడే వరకు గాలించినా మృతదేహం దొరకలేదన్నారు పోలీసులు. సోమవారం తెల్లవారుజామున గాలింపు తిరిగి ప్రారంభించారు. పెదపట్నం, ఇంతేరు చిన్న గొల్లపాలెం వరకు ఉన్న అన్ని పీఎస్ లను పోలీసులు అప్రమత్తం చేశారు. పెదపట్నం బీచ్ ఒడ్డుకు బాలుడి మృతదేహం కొట్టుకువచ్చిందని స్థానికులు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా సంఘటన స్థలానికి వెళ్లి బైక్ పై బాలుడి మృదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై వస్తున్న బాధిత కుటుంబాన్ని ఆపి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి బాలుడి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అవాస్తవాలు చక్కర్లు కొడుతున్నాయని పోలీసులు తెలిపారు.