ఏపీలో తీవ్ర విషాదాలు - రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య, మరో చోట అమ్మనాన్నలను విడిచి ఉండలేక బాలిక సూసైడ్
Andhra News: గుంటూరు జిల్లా పెదకాకానిలో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ బాలిక అమ్మానాన్నలను విడిచి ఉండలేక హాస్టల్‌లో రిబ్బన్‌తో ఉరి వేసుకుంది.
Lovers Forceful Death In Guntur District: ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లాలో (Guntur District) ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అటు, శ్రీకాకుళం జిల్లాలో వివాహేతర సంబంధం మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఇదే జిల్లాలో మరో చోట అమ్మానాన్నలను విడిచి ఉండలేక హాస్టల్‌లో ఓ బాలిక రిబ్బన్‌తో ఉరి వేసుకుని చనిపోయింది. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఓ ప్రేమ జంట శుక్రవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజ (21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా చదివిన మహేశ్.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శైలజతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.
వీరి ప్రేమ విషయం ఇటీవలే ఇరు కుటుంబాలకు తెలిసింది. 10 రోజుల క్రితం యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. అయితే, యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ప్రేమికులు దసరా సమయంలో ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి తరఫు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ప్రేమకు అడ్డు వస్తారని భావించి భయంతో ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.
అమ్మనాన్నకు దూరంగా ఉండలేక..
అమ్మనాన్నలకు దూరంగా ఉండలేక ఓ బాలిక రిబ్బన్‌తో ఉరి వేసుకుని మృతి చెందిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం వైటీసీలో కొనసాగుతోన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో సీతంపేట మండలానికి చెందిన బాలిక (12) ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపింది. సెలవులు పూర్తి కావడంతో గురువారం ఆమె తల్లిదండ్రులు బాలికను స్కూల్లో విడిచిపెట్టి ఇంటికి వెళ్లారు. తాను హాస్టల్‌లో ఉండలేనని.. ఇంటికి వచ్చేస్తానని ఆమె తల్లిదండ్రులతో చెప్పింది. నెలాఖరుకు మళ్లీ వస్తామని.. తల్లిదండ్రులు నచ్చచెప్పగా అందుకు ఒప్పుకుంది.
అయితే, తల్లిదండ్రులను విడిచి ఉండలేక బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హాస్టల్‌లో విడిచి వెళ్లిన గంట తర్వాత జడ రిబ్బన్‌తో ఉరి వేసుకుని చనిపోయింది. తోటి విద్యార్థినులు గమనించి టీచర్లు, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బాలిక స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివాహేతర సంబంధం కారణంగా..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన గొల్లబాబు (45), లక్ష్మి పైతమ్మ (40) దంపతులు ఉపాధి కోసం బెంగుళూరులో ఉంటున్నారు. వీరి వద్ద శ్రీకాకుళం జిల్లాకు చెందిన గణేశ్ కుమార్ (20) కొన్నేళ్లుగా నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గొల్లబాబు.. భార్య పైతమ్మతో గణేశ్ వివాహేతర సంబంధం గురించి తెలిసి ఆగ్రహానికి గురయ్యాడు. పథకం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఇద్దరిపైనా దాడి చేసి చంపేశాడు. అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోణనకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.