Kunrool News : ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదం, పై కప్పు పెచ్చులు ఊడిపడి ఇద్దరి విద్యార్థులకు తీవ్రగాయాలు
Kunrool News : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం జరిగింది. స్లాబు పెచ్చులు ఊడిపడి ఇద్దరి విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.
Kunrool News : రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తుంది. అయితే కొన్ని చోట్ల ఇంకా పరిస్థితులు మారలేదు. ఇంకా విద్యార్థులు శిథిలావస్థ భవనాల్లోనే చదువులు సాగిస్తున్నారు. ఇలాంటి భవనాల్లో పైకప్పులు పడి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలో స్లాబు పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఇద్దరి విద్యార్థులకు తీవ్రగాయాలు
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలోని పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. మండల ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో స్లాబు పెచ్చులు ఊడిపడి ఇద్దరికి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. 2వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ క్లాస్ రూమ్ లో ఉండగా ఒక్కసారిగా సీలింగ్ పై కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో తరగతి గదిలో ఉన్న సఫాన్, అరీఫ్ విద్యార్థుల తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరిందని ఎన్నో సార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికైనా పాఠశాలను మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తల్లిదండ్రులు ఆగ్రహం
"పిల్లలు రెండు మూడు సార్లు చెప్పారు. ఇలా పెచ్చులు పడిపోతున్నాయి. మేం ఉపాధ్యాయులకు చెప్పాం. పిల్లలు ఎక్కువ లేరని చూద్దాంలే అన్నారు. పాఠశాల పైకప్పు సరిగ్గా లేదు. పెచ్చులు పడిపోయాయి. ఇప్పుడు పిల్లల ప్రాణాల మీదుకు తెచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాం. " అని స్థానికులు అంటున్నారు.
కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండల ప్రాధమికోన్నత పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలి చిన్నారుల తలలకు తీవ్ర గాయాలైన ఘటన బాధాకరం. నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం పాఠశాలల పునరుద్ధరణ కోసం ఏమీ చేయడం లేదనడానికి ఈ ఘటనే ఉదాహరణ.(1/3) pic.twitter.com/U1Nb7zoXcY
— N Chandrababu Naidu (@ncbn) April 28, 2022
చిన్నారులకు గాయాలు బాధాకరం : చంద్రబాబు
కర్నూల్ జిల్లాలోని గోనెగండ్లలో పాఠశాల పై కప్పు పెచ్చులూడి ఇద్దరు చిన్నారులకు గాయాలు కావడం బాధకరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మన బడి నాడు-నేడు అని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సర్కారు చేసిందేంలేదని ఆరోపించారు. తల్లిదండ్రులు పాఠశాల శిథిలావస్థ గురించి హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బడికి వచ్చిన చిన్నారులు రక్తం చిందించాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఇకనైనా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రద్ధ చూపాలని ట్వీట్ చేశారు.