AP SSC Exams Mass capying : పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, టీచర్ల ఫోన్లలో కోడ్ లాంగ్వేజ్, ఆరుగురి సస్పెండ్
AP SSC Exams Mass capying : కృష్ణా జిల్లా పసుమర్రు హైస్కూల్ లో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న సమచారంతో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో టీచర్ల ఫోన్లలో పేపర్లను గుర్తించారు.
AP SSC Exams Mass capying : ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో రోజుకో ఉదంతం వెలుగులోకి వస్తుంది. మొన్నటి వరకూ పేపర్లు లీక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మాస్ కాపీయింగ్ ఆరోపణలు కృష్ణా జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు సహకరించారన్న ఆరోపణపై ఆరుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఒక గంట ముందుగానే ప్రశ్నపత్రాన్ని తీసుకొచ్చి, సమాధానాలు తయారుచేసి విద్యార్థులకు అందిస్తున్నట్లు ప్రాథమిక సమాచారంతో డీఈవో సుల్తానా ఇతర అధికారులు పరీక్షా కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఉపాధ్యాయుల ఫోన్ లలో ఉన్న సమాచారం ఆధారంగా వారిని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించామని డీఈవో తెహేరా సుల్తానా తెలిపారు.
అసలేం జరిగింది?
కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు పదోతరగతి ప్రశ్నాపత్రాన్ని ఒక గంట ముందుగానే తీసుకొచ్చి సమాధానాలను తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారని విద్యాశాఖకు ఫిర్యాదు అందింది. ఈ సమాచారంతో విద్యాశాఖ అధికారులకు తనిఖీలు చేశారు. విద్యాశాఖ, పోలీసుశాఖ అధికారులు స్కూల్ లో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఈవో తాహేరా సుల్తానా మాట్లాడుతూ తమకు పసుమర్రు హై స్కూల్ లో మాస్ కాపీయింగ్ జరుగుతుందని టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం వచ్చిందన్నారు. అధికారులతో కలిసి తనిఖీ చేయగా పాఠశాలలో ఆరుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. వారి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు గుర్తించామని, వారి ఫోన్ల నుంచి పేపర్ టైట్- అయాం వెయిటింగ్ అన్న మెసేజ్ లు ఉన్నాయని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశామని, తదుపరి విచారణ పూర్తైన అనంతరం వివరాలు తెలియపరుస్తామన్నారు. కాగా మాస్ కాపీయింగ్ వ్యవహారంలో ప్రధానోపాధ్యాయుడు పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
"ఈ రోజు మ్యాథ్స్ పరీక్ష జరుగుతోంది. టోల్ ఫ్రీ నంబర్ కు మాస్ కాపీయింగ్ జరుగుతుందని కాల్ వచ్చింది. పసుమర్రులో మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని సమాచారం అందింది. ఇక్కడకు వచ్చి తనిఖీలు చేశాం. ఇక్కడ కొంత మంది టీచర్లు వెయిట్ చేస్తున్నారు. వారి ఫోన్లలో కొంత సమాచారాన్ని పోలీసులు గుర్తించారు. పేపర్ టైట్ వెయిటింగ్ అనే మెసేజ్ లు ఉన్నాయి. నాలుగు ఫోన్లను సీజ్ చేశాం. పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. " అని డీఈవో తెలిపారు.