Konaseema News:కోనసీమలో విషాదం: కిరాణా కొట్టులో పేలుడు, భార్యాభర్తలు మృతి, దీపావళి బాణాసంచా కారణం?
Konaseema News: కిరాణా కొట్టులో దాచి ఉంచిన దీపావళి బాణాసంచాకు నిప్పంటుకున్న ఘటనలో భార్య భర్తలు స్పాట్‌లోనే దుర్మరణం పాలయ్యారు.. కుమారుడుకి తీవ్ర గాయాలయ్యాయి.

Konaseema News: దసరా పండుగ పూట అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం అలముకుంది. త్వరలోనే రాబోయే దీపావళి పండుగ కోసం కిరాణా కొట్టులో దాచి ఉంచిన దీపావళి బాణాసంచాకు నిప్పంటుకున్న ఘటనలో భార్య భర్తలు స్పాట్‌లోనే దుర్మరణం పాలయ్యారు. అక్కడిక్కడే బార్యభర్తలు కంచర్ల శ్రీనివాసరావు(50), కంచర్ల సీత(48) మృతిచెందగా కుమారుడుకి తీవ్ర గాయాలయ్యాయి.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
అసలేం జరిగిందంటే...
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఓ కిరాణా దుకాణంలో విస్పొటనం సంభవించి మంటలు చెలరేగాయి.. ఏం జరుగుతుందో తెలిసే లోపే మంటలు తీవ్రం కాగా కిరాణా కొట్టులో బాణాసంచా పేలిపోతూ మంటలు ఎగబాకాయి.. దీంతో ఉలిక్కిపడ్డ స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ బాణాసంచా పేలుతుండడంతో అమలాపురం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు..
ఇంట్లోనే కిరాణా కొట్టు ఉండగా ఓ పోర్షన్‌లో కొట్టు నిర్వహిస్తుండగా పక్క పోర్షన్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో దంపతులిద్దరూ కిరణా కొట్టులో ఉండి కిరాణా సరకు అమ్ముతున్నారు. దీంతో మంటల్లోనే చిక్కుకుపోయిన బార్యభర్తలు శ్రీనివాసరావు, సీత కాలిపోయారు. అప్పటికి పక్క పోర్షన్‌లో ఉన్న కుమారుడు వారిని రక్షించే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. పేలుడు ధాటికి ఇంటిముందు భాగం కుప్పకూలింది..
ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలిపోయిన బాణాసంచా..
ప్రమాదం సంభవించే సమయంలో మృతులిద్దరూ కొట్టులోనే ఉన్నారని, అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగి బాణాసంచా పేలిపోవడంతో ఆ మంటల్లోనే చిక్కుకుపోయి మరణించారని స్థానికులు చెబుతున్నారు. అగ్నిమాపక శకటం వచ్చేసరికి కిరాణా కొట్టు అంతా కాలి దగ్ధం అయ్యింది.. అయితే ఈప్రమాదంలో దంపతులిద్దరూ మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది.. ఘటనా స్థలానికి పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, ఎస్సైలు వెళ్లి పరిశీలించారు. తీవ్రంగా గాయపడ్డ కుమారుడు ప్రస్తుతం అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీమరాజు తెలిపారు.
అమ్మగా మిగిలిపోయిన బాణాసంచా ప్రాణాలు తీసిందా..
గత ఏడాది బాణాసంచా విక్రయాలు జరిపేందుకు కిరాణా కొట్టు యజమాని కంచర్ల శ్రీనివాసరావు ఆర్డీవో ద్వారా లైసెన్స్ తీసుకున్నాడు. అయితే అప్పుడు అమ్మగా మిగిలిన సరకును ఉంచారు. త్వరలోనే దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో సరుకును దింపే ప్రయత్నంలో అవి నిప్పంటుకుని పేలిపోయాయని పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మిగిలిపోయిన బాణాసంచాను ఇళ్లల్లో ఉంచుకోవద్దని, లైసెన్స్ కలిగి ఉన్న గొడౌన్స్‌లో భద్రపరుచుకోవాలని కానీ ఇళ్లవద్ద ఉంచడం వల్ల వారి ప్రాణాలకే కాక ఇంటి పక్కనున్న వారి ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు హితవు పలికారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





















