Kolkata: ఒళ్లంతా 14 లోతైన గాయాలు, మర్మాంగాన్ని ఛిద్రం చేసి హత్య - ఒళ్లు జలదరించేలా కోల్‌కత్తా డాక్టర్ అటాప్సీ రిపోర్ట్
Kolkata Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ అటాప్సీ రిపోర్ట్‌లో ఒళ్లు జలదరించే విషయాలెన్నో ఉన్నాయి. అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది.
Kolkata Doctor Murder Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ నరకయాతన అనుభవించి చనిపోయిందని అటాప్సీ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో హత్యాచారానికి గురైంది. చనిపోయే ముందు ఆమెని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారని రిపోర్ట్ తేల్చి చెప్పింది. శరీరమంతా లోతైన గాయాలయ్యాయి. ఇప్పటికే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై (Abhaya Case) చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపినట్టు నివేదికలో తేలింది. అంతే కాదు. అత్యంత దారుణంగా బలవంతం చేసి మర్మాంగానికి గాయమయ్యేలా పాశవికంగా ప్రవర్తించినట్టు రిపోర్ట్ వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం శరీరం మొత్తం మీద 14 గాయాలయ్యాయి. ముఖం, తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్..ఇలా అన్ని చోట్లా గాయాలు కనిపించాయి. బలవంతంగా గొంతు నులిమి విలవిలలాడి ప్రాణాలు కోల్పోయేలా చేసినట్టు నివేదికలో వెల్లడైంది. ఇది కచ్చితంగా హత్యేనని స్పష్టం చేసింది. ఊపిరితిత్తుల నుంచి తీవ్ర రక్తస్రావమైందని, పలు చోట్ల రక్తం గడ్డ కట్టుకుపోయిందని రిపోర్ట్ పేర్కొంది. అయితే..ఎక్కడా ఫ్రాక్చర్స్ కాలేదని వెల్లడించింది. బ్లడ్‌తో పాటు శరీరంలో గుర్తించిన ఇతరత్రా ఫ్లూయిడ్ శాంపిల్స్‌ని అనాలసిస్‌కి పంపించారు.
#WATCH | Doctors and locals from Mumbai hold protest at Azad Maidan to protest against Kolkata doctor rape and murder pic.twitter.com/Kc6bNuEg9h
— ANI (@ANI) August 19, 2024
సీబీఐ విచారణ..
ఆగస్టు 9వ తేదీన ఈ దారుణంగా జరగ్గా ఇప్పటి వరకూ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది. అన్ని కోణాల్లోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాలేజ్ మాజీ ప్రిన్సిపల్‌నీ విచారిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయం జరుగుతున్న నమ్మకంతో ఉన్నారు. అటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. దీనిపైనా రాజకీయంగా దుమారం రేగుతోంది. ముఖ్యమంత్రే ఇలా ర్యాలీ చేయడమేంటని మండి పడుతున్నారంతా. బెంగాల్‌కి హోం మంత్రి కూడా దీదీయే. (Also Read: Kolkata: ట్రైనీ డాక్టర్‌కి హాస్పిటల్ రహస్యాలు తెలిశాయా! అందుకే ఇంత దారుణంగా చంపారా - ఏంటీ మిస్టరీ?)
దీదీపై విమర్శలు..
ఇలాంటి దారుణాలు జరగకుండా శాంతి భద్రతల్ని కాపాడాల్సింది పోయి...ఇలా అందరిలా ర్యాలీ ఎందుకు చేసినట్టు అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. త్వరలోనే విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుని విచారించనుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ ఘటనను నిరసిస్తూ 24 గంటల పాటు ఆందోళనలు చేశారు. వైద్య సేవలను బహిష్కరించారు. వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read: Kolkata: బీ అలెర్ట్ - కోల్‌కత్తా డాక్టర్ ఫొటో షేర్ చేస్తున్నారా? అయితే చట్ట ప్రకారం మీరూ నేరస్థులే