Kidnapped Woman: 17 ఏళ్ల క్రితం కిడ్నాప్ అయింది, ఉన్నట్టుండి ఇప్పుడు ప్రత్యక్షమైంది - మిస్టరీ ఛేదించిన పోలీసులు
Kidnapped Woman Found: 17 ఏళ్ల క్రితం కిడ్నాప్‌కి గురైన యువతి ఢిల్లీలో పోలీసులకు కనిపించింది.
Kidnapped Woman Found:
15 ఏళ్ల వయసులో కిడ్నాప్..
అప్పుడెప్పుడో 2006లో కిడ్నాప్ అయిన ఓ యువతి దాదాపు 17 ఏళ్ల తరవాత ప్రత్యక్షమైంది. 15 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయిన ఆమె ఇప్పుడు ఉన్నట్టుండి కనిపించడం అందరినీ షాక్‌కి గురి చేసింది. ఢిల్లీలోని గోకల్‌పురిలో ఆమెను గుర్తించారు. డీసీపీ రోహిత్ మీనా చెప్పిన వివరాల ప్రకారం...సీక్రెట్ ఆపరేషన్ చేపట్టి ఆమెని గుర్తించారు.
"మే 22వ తేదీన సీమపురి పోలీస్ స్టేషన్ టీమ్ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. రహస్యంగా సమాచారం సేకరించింది. 17 ఏళ్ల క్రితం కిడ్నాప్‌కి గురైన ఆమెను గుర్తించాం. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. 2006లోనే ఈ కిడ్నాప్ ఘటనపై కేసు నమోదైంది. అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేశారు"
- డీసీపీ రోహిత్ మీనా
అయితే...కిడ్నాప్ అయిన తరవాత విచారణ చేపట్టిన పోలీసులు ఇటీవలే కీలక సమాచారం సేకరించారు. అప్పటి నుంచి ఆ యువతి ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందని వివరించారు. ఆ వ్యక్తితో గొడవ పడి గోకల్‌పురిలో ఒంటరిగా జీవిస్తున్నట్టు చెప్పారు.
"2006లో ఈ యువతిని కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆ అమ్మాయిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. ఇంటి నుంచి వెళ్లిపోయి దీపక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. యూపీలోని బలియాలో అతనితో కలిసి ఉంది. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. అక్కడి నుంచి ఆమె బయటకు వచ్చేసి..ఇప్పుడు ఒంటరిగా గోకల్‌పురిలో జీవిస్తోంది"
- డీసీపీ రోహిత్ మీనా
ఇండోర్‌లో ఇలా...
ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన ఓ బాలిక...తల్లిదండ్రులు తిడతారేమో అన్న భయంతో సినిమా రేంజ్ డ్రామా ఆడింది. కిడ్నాప్ అయ్యానని చెప్పి ముచ్చెమటలు పట్టించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. బీఏ ఫస్టియర్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇండోర్‌కి 50 కిలోమీటర్ల దూరంలోని ఉజ్జెయిన్‌కి వెళ్లింది. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. వెంటనే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ఆ బాలిక కోసం అన్ని చోట్లా వెతికిన పోలీసులు చివరకు కిడ్నాప్ కథంతా ఫేక్ అని తేల్చి చెప్పారు. ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఫ్యాకల్టీ మెంబర్ ఒకరు తనను ఓ టెంపుల్ వద్ద దించాడని, అక్కడే ఓ ఆటో ఎక్కానని చెప్పింది ఆ బాలిక. డ్రైవర్ తనను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లాడని, ఓ క్లాత్ నోటి దగ్గర పెట్టడం వల్ల అపస్మారక స్థితిలో వెళ్లిపోయానని టెన్షన్ పడుతూ అంతా వివరించింది. ఇదంతా కంప్లెయింట్‌లో ప్రస్తావించాడు ఆ బాలిక తండ్రి. వెంటనే పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. కానీ..ఆ అమ్మాయి చెప్పినట్టు అక్కడ ఏమీ జరగలేదు. అప్పటికే చుట్ట పక్కల ప్రాంతాల పోలీసులకూ సమాచారం అందించారు. ఉజ్జెయిన్ పోలీసులకూ ఫోటో పంపారు. అక్కడ ఓ రెస్టారెంట్‌లో ఒంటరిగా అమ్మాయి కూర్చుని ఉండటాన్ని గమనించారు ఉజ్జెయిన్ పోలీసులు. వెంటనే మిస్ అయిన అమ్మాయి ఫోటోతో మ్యాచ్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకటే అని కన్‌ఫమ్ చేసుకున్నారు. వెంటనే ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.