Crime News: అద్దె ఇంటి కోసం వచ్చి అడ్వాన్స్! దంపతుల్ని నమ్మంచి గొంతుకోసిన మహిళలు
Khammam Crime News | అద్దె ఇంటి కోసం వచ్చి మంచివాళ్లుగా నటించారు. ఈ క్రమంలో భార్యాభర్తలను ముగ్గురు మహిళలు దారుణంగా హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగింది.
Khammam Double Murder | నేలకొండపల్లి: నేరాలు చేయాలని అనుకునేవాళ్లు తెలివి మీరుతున్నారు. డబ్బు, బంగారం, తమకు కావాల్సిన దాని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంటికి అద్దె కోసం వచ్చిన దుండగులు కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అంతలోనే ఏం జరిగిందోగానీ అద్దె ఇంటి కోసం వచ్చిన నిందితులు ఓనర్ దంపతులను దారుణంగా హత్య చేశారు. నేలకొండపల్లిలో జరిగిన ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
అద్దె ఇంటి కోసం వచ్చి దారుణం
ఎర్రా వెంకటరమణ తన భార్యతో కలిసి నేలకొండపల్లిలో నివాసం ఉంటున్నారు. అద్దె ఇల్లు కోసం వెతుకతూ పది రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు వారి ఇంటికి వచ్చారు. మొత్తం తిరిగి చూసిన ఆ ముగ్గురు ఇల్లు తమకు నచ్చిందని వెంకటరమణ, ఆయన భార్యకు చెప్పారు. పైగా రెంట్ ఇంటికి అడ్వాన్స్ గా కొంత నగదు సైతం ఇచ్చి వెళ్లారు. ఈ క్రమంలో మరోసారి నిందితులు ముగ్గురు రాత్రివేళ వచ్చి రమణ ఇంట్లో నే భోజనం చేసి వెళ్లిపోయారని సమాచారం. మరుసటి రోజు రాత్రి మరోసారి వచ్చిన ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో వెంకట రమణ, ఆయన భార్య కృష్ణ కుమారికి కళ్లల్లో కారం కొట్టి దాడిచేసి, దారుణంగా హత్య చేశారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు దోచుకున్నాక.. ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్లారు.
ప్రతిరోజు లాగానే వెంకటరమణ కుమార్తె తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎప్పుడు లేనిది కొత్తగా స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం రావడంతో కుమార్తె వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి చూడాలని చెప్పింది. వారు వెళ్లి చూడగా, ఇంటికి తాళంతో పాటు ఇంటి చుట్టూ కారం చల్లి ఉందని గుర్తించారు. వారి కుమార్తెకు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంకటరమణ దంపతుల మృతదేహాలను, ఇంటిని పరిశీలించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ సేకరించిన పోలీసులు పరిశీలించారు. వెంకటరమణ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దె ఇంటి కోసం వచ్చిన మహిళలే వీరిని హత్య చేసి ఉంటారని ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Also Read: Crime News: సీక్రెట్ సరోగసికి వచ్చిన మహిళ - 9వ అంతస్తు నుంచి పడి మృతి - మైహోమ్ భూజాలో ఏం జరిగింది ?