Kerala Doctor Suicide: BMW కార్ కట్నంగా ఇవ్వనందుకు పెళ్లి క్యాన్సిల్ చేసిన బాయ్‌ఫ్రెండ్, 26 ఏళ్ల లేడీ డాక్టర్ ఆత్మహత్య
Kerala Crime News: కట్నం కింద BMW కార్ ఇవ్వలేదని బాయ్ ఫ్రెండ్ పెళ్లి క్యాన్సిల్ చేశాడన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది.
Kerala Doctor Suicide:
కేరళలో ఘటన..
కేరళలోని తిరువనంతపురంలో ఓ 26 ఏళ్ల లేడీ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ మధ్యే తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి ఫిక్స్ అయింది. అయితే...కట్నం విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. అడిగిందల్లా ఇవ్వలేదన్న కోపంతో పెళ్లి చేసుకోనని బాయ్‌ఫ్రెండ్ తేల్చి చెప్పాడు. మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనపై స్పందించారు. విచారణకు ఆదేశించారు. మృతురాలు డాక్టర్ సహానా తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో పీజీ చేస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు..ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా కట్నం అడిగినందుకు ఆ చట్టం కిందా కేసు నమోదైంది. మృతురాలి బంధువుల వాంగ్మూలం తీసుకున్నారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...డాక్టర్ సహానా తన తల్లితో కలిసి తిరువనంతపురంలో ఉంటోంది. గల్ఫ్‌లో పని చేసిన ఆమె తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. ఆ తరవాత కొద్ది రోజులకు డాక్టర్ రువైస్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతా బానే ఉందనుకున్న తరుణంలో కట్నం విషయంలో విభేదాలొచ్చాయి.
ఇదీ జరిగింది..
వరుడి కుటుంబం 150 గోల్డ్ కాయిన్స్, 15 ఎకరాల భూమి, ఓ BMW కార్ కట్నం కింద ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సహానా కుటుంబం ఆరోపిస్తోంది. తాము అంతగా ఇచ్చుకోలేకమని చెప్పినందుకు కోపంతో పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఫలితంగా ఒక్కసారిగా డిప్రెషన్‌లోకి వెళ్లింది సహానా. "అందరికీ డబ్బే కావాలి" అంటూ ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. మంత్రి వీణా జార్జ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పూర్తి స్థాయిలో రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. పూర్తి నివేదికతో డిసెంబర్ 14 లోగా కమిషన్ ముందు హాజరు కావాలని సంబంధిత అధికారులకు నోటసులిచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.