Kerala Crime News: ఏఐతో టెక్నాలజీతో స్నేహితుడిలా బిల్డప్ - 40 వేలు స్వాహా- అప్‌డేట్ అవుతున్న సైబర్ కేటుగాళ్లు
Kerala Crime News: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మొహం మార్చుకొని ఓ వ్యక్తికి అతడి స్నేహితుడిలా ఫోన్ చేశారు. నిజంగా ఫోన్ చేసేంది స్నేహితుడు అనుకొని అడగ్గానే డబ్బులు ఇచ్చి మోసపోయాడో వ్యక్తి.
Kerala Crime News: రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుంటూ అందినకాడికి దోచేసుకుంటున్నారు. మొన్నటి వరకు ఆన్ లైన్ సైట్లు, ఫేక్ కాల్స్, మెసేజ్ ల ద్వారా ప్రజల ఖాతాల్లోంచి డబ్బులు స్వాహా చేసిన కొందరు ఇప్పుడు కొత్త పంథాలో దూసుకెళ్తున్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకొని మొహాలు మార్చుకుంటున్నారు. ఆ మొహాన్ని అతికించుకొని వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తారు. ఆ తర్వాత వాళ్లను నమ్మించి ఫోన్ చేసి డబ్బులు గుంజుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది.
కేరళలోని కోజికోడ్ కు చెందిన రాధాకృష్ణకు గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అందులో మాట్లాడుతున్న వ్యక్తి ఏపీలో ఉంటున్న అతడి స్నేహితుడిని పోలి ఉన్నట్లు గుర్తించాడు. అయితే ఫోన్ లో మాట్లాడుతున్న మోసగాడు.. రాధాకృష్ణకు తెలిసిన పేర్లను చెప్పాడు. దీంతో అతడు తన స్నేహితుడేనని రాధా కృష్ణన్ భావించాడు. ఆ తర్వాత సైబర్ నేరగాడు తాను దుబాయ్ లో ఉంటున్నాని ... తన బంధువులు చికిత్స కోసం డబ్బులు కావాలని అడిగినట్లు వెల్లడించాడు. భారత్ కు రాగానే ఇచ్చేస్తానని.. రూ.40 వేలు అప్పుగా ఇవ్వమని కోరాడు.
ఇదంతా నిజమని నమ్మిన రాధాకృష్ణన్ రూ.40 వేల పంపాడు. ఆ తర్వాత అతడు మరోసారి 35 వేలు పంపాలని కోరాడు. దీంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణ తన స్నేహితుడిని సంప్రదించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 15వ తేదీన కేసు నమోదు చేసుకున్న కేరళ పోలీసుల సైబర్ ఆపరేషన్ విబాగం దర్యాప్తు చేపట్గా... మోసగాడిని గుర్తించి అతడి వద్ద నుంచి 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును రాధాకృష్ణకు అందజేశారు.
ఇటీవలే హైదరాబాద్ లోనూ సైబర్ మోసం
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇటీవలే సైబర్ నేరగాళ్లు నిలువునా ముంచేశారు. సోషల్ మీడియా పెట్టే పోస్టులను లైక్ చేస్తే చాలు అంటూ 47 లక్షలు గుంజేశారు. మొదట్లో ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన పని లేదంటూనే మొదలుపెడతారు. క్రమంగా పని కానిచ్చేసి వెళ్లిపోతారు. ఈ ఉద్యోగి కూడా అలానే బోల్తా పడ్డాడు. మొదట్లో నమ్మించడానికి కొంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశారు. అది నిజమే అనుకున్నాడు. అక్కడే మరో ట్రిక్ ప్లే చేస్తారు సైబర్ కేటుగాళ్లు. రోజువారిగా వచ్చే ఆదాయం మరింత పెరగాలంటే కొత్త అమౌంట్ కట్టాలని చెబుతారు. దీన్ని కంటిన్యూ చేయాలంటే ఓ అకౌంట్ క్రియేట్ చేస్తామని కవర్ చేస్తారు. ఏ రోజు డబ్బులు ఆ రోజు అందులో పడతాయని చెప్పారు. వాటిని నెలకోసారి తీసుకోవచ్చని చెప్పారు. దానికి ఓకే అన్నాడు. ఇలా పని చేస్తున్న కొద్దీ అందులో అమౌంట్ పడుతూ ఉంది. కానీ తీసుకోవడానికి మాత్రం వీలుపడటం లేదు. అదే విషయాన్ని అడిగితే ఏదో కారణం చెప్పి కొంత అమౌంట్ పే చేస్తే రిలీజ్ అవుతుందన్నారు. దాన్ని నమ్మిన ఆ వ్యక్తి ఆ డబ్బులు కట్టేశాడు. అలా విడతల వారీగా 47 లక్షలు కట్టించుకున్నారు. కానీ ఆ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మాత్రం రిలీజ్ చేయలేదు.
ఇంత డబ్బులు పోయాక బాధితుడికి అసలు విషయం తెలిసింది. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చెప్పిన విషయాలకు బాధితుడు మరింత షాక్ అయ్యాడు. ఇలాంటి కేసులు రోజుకు పదుల సంఖ్యలో రిజిస్టర్ అవుతున్నాయని చెప్పారు. ఆరు నెలల్లోనే ఆరువందలకుపైగా కేసులు నమోదైనట్టు లెక్కలు చూపించారు. ఈ సైబర్ దందాకు ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే మోసపోతున్నారని చెప్పారు.