Karnataka: భార్య కోసం ఇద్దరు భర్తల ఫైటింగ్, అసలేం జరిగిందంటే?
ఒక భార్య కోసం ఇద్దరు భర్తలు గొడవకు దిగారు. మొదటి భర్తను చంపేస్తే.. రెండో భార్య పూర్తిగా తనకే సొంతం అవుతుందనుకొని హత్యా ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
పెళ్లి కాని అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం మనం చాలా సార్లే చూసుంటాం. కానీ ఒక భార్య కోసం ఇద్దరు భర్తలు కొట్టుకోవడం మాత్రం చాలా అరుదు. కానీ అలాంటి ఓ ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. తన భార్య మొదటి భర్తను కిడ్నాప్ చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కుడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అసలేం జరిగిందో.. ఒక భార్య కోసం ఇద్దరు భర్తలు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు.
మొదటి భర్తకు తెలియకుండా రెండో పెళ్లి..
రాజస్థాన్ నుంచి మంజుల అనే యువతి ఉపాధి కోసం కర్ణాటక రాష్ట్రంలోని కుడూరుకు వచ్చింది. అక్కడే పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడే ఉంటున్న మోహన్ రామ్ అనే వ్యక్తికి మంజులకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహ అనంతరం ఈ జంట కుడూరులోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అియేత పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత ఆ దంపతులు ఇద్దరూ రాజస్థాన్ కు వెళ్లారు. మంజుల మళ్లీ వెనక్కి తిరిగి రాలేదు. కొన్నాళ్లు అక్కడే ఉండి వస్తుందిలే అనుకొని మోహన్ రామ్ కుడూరు చేరుకున్నాడు. భార్యకు తరచుగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ క్రమంగా ఆమె అతడి ఫోన్ కాల్స్ కు స్పందించడం మానేసింది. ఏం జరుగుతుందో అర్థం కాని మోహన్ రామ్.. ఆమెను తీసుకొచ్చేందుకు రాజస్థాన్ కు వెళ్లాడు. అక్కడి వాళ్లు చెప్పిన నిజం విని షాకయ్యాడు.
తరచూ ఫోన్ లు చేస్తున్నాడని అంతమొందించాలనుకున్నాడు..
మోహన్ రామ్ ఇంటికి రాగానే.. తన భార్య మంజుల హర్యానాలోని పిప్లివాలా గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్ అనే యువకుడిని వివాహం చేసుకుందట. అతడితో పాటు బెంగళూరుకు వెళ్లిపోయిందని తెలిసుకున్నాడు. తన నుంచి విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండో వివాహం చెల్లదంటూ భార్యకు చరవాణిలో సందేశాన్ని పంపించాడు. ఆమెకు ఫోన్ చేసినా, సందేశాలు పంపించినా నిన్న చంపేస్తామంటూ ఓం ప్రకాశ్.. మోహన్ రామ్‌ను భయపెట్టాడు. పట్టు వీడకుండా ఆమెకు సందేశాలు పంపించడంతో ఏలాగైనా సరే అతడిని చంపేయాలని ఓం ప్రకాశ్ పథకం వేశాడు. స్నేహితులను వెంట పెట్టుకుని కుడూరుకు చేరుకున్నాడు. మోహన్ రామ్ నిత్యావసర సరకులు కొంటుండగా... ఓం ప్రకాశ్, అతడి స్నేహితులు వెంటపడి అపహరించారు. అనంతరం కారులో ఎక్కించి హత్య చేసే ప్రయత్నం చేశారు.
కారు మొరాయించడంతో దొరికిపోయిన నిందితులు..
అయితే మోహన్ రామ్ కేకలు విన్న స్థానికులు.. కారును వెంబడించారు. కాస్త దూరం వెళ్లేసరికి కారు మొరాయించడంతో వారు స్థానికులకు దొరికిపోయారు. గ్రామస్థుల సమాచారంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు ఓం ప్రకాశ్ సహా అతడి స్నేహితులు శైలేంద్ర, ప్రదీప్, దల్లారమ్, జితేంద్ర, శకర్ పాటిల్, దినేశ్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. కారును, హత్య చేసేందుకు వారితో పాటు తెచ్చుకున్న వికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.