
Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!
Karimnagar Fire Accident: కరీంనగర్ నగరంలో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఓ చోట కేవలం ఆస్తి నష్టం, మరో చోట ప్రాణ నష్టం సంభవించింది. మంటల్లో చిక్కుకుని ఓ రిటైర్డ్ అధికారి సజీవ దహనం అయ్యారు..

Karimnagar Fire Accident: కరీంనగర్ నగరంలో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఓ చోట కేవలం ఆస్తి నష్టం జరగగా, మరో చోట ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. మంటల్లో చిక్కుకుని ఓ రిటైర్డ్ అధికారి సజీవ దహనం అయ్యారు.. కరీంనగర్ లోని టవర్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సర్వీస్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికింకా మంటలు అదుపులోకి రాలేదు. పక్కనున్న వాణిజ్య సముదాయానికి ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలు అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా? మరి ఏమైనా కారణమా అనేది తేలాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
కాశ్మీర్ గడ్డలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి
కరీంనగర్ నగరంలో ఒకేరోజు రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి. బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరగగా, నగరంలోని కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో రిటైర్డ్ ఎంపీడీవో మధుసూదన్ రావు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో మధుసూదన్ రావు సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది. ఆయన భార్య సులోచనతో పాటు మరో వ్యక్తికి తీవ్ర కాలిన గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. కాలిన గాయాలైన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కాగా, అగ్ని ప్రమాదంలో రిటైర్డ్ ఎంపీడీఓ చనిపోవడంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వాచారణ చేపట్టారు.
హైదరాబాద్ లోనూ వరుస అగ్ని ప్రమాదాలు!
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగి ఆరుగురు చనిపోగా.. రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న తుక్కు గోదాంలో ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తుల మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో.. స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జనవరిలో డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపట్టారు. డెక్కన్ మాల్ ఘటన తర్వాత అగ్ని ప్రమాదాల నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతికి కారణం గోడౌనే.. సెప్టెంబర్‌లో రూబీ లాడ్జిలో ప్రమాదం జరిగి 8 మంది మృతి చెందగా.. బ్యాటరీ గోదామే కారణమైంది. డెక్కన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంటల్లో ముగ్గురు సజీవ దహనానికి కారణం గోడౌనే. ఇప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నికీలలు చెలరేగడానికి కారణమూ గోదామే. ఫైర్‌సేఫ్టీ మచ్చుకైనాలేని చోట ప్రాణాలను మింగేస్తున్న గోడౌన్లు. కమర్షియల్ కాంప్లెక్సుల్లోనూ గోదాముల నిర్వహణతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయక చర్యలే తప్ప.. పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

