Kanjhawala Case: కంజావాలా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు, స్కూటీపై ఉన్న యువకుడు ఎవరు?
Kanjhawala Case: కంజావాలా కేసులో మరో సీసీటీవీ పుటేజ్ కొత్త అనుమానాలకు తావిస్తోంది.
Kanjhawala Case CCTV Footage:
కొత్త ఫుటేజ్
కంజావాలా కేసులో మరో రెండు సీసీటీవీ ఫుటేజ్‌లు కొత్త అనుమానాలకు తెర తీశాయి. అంజలి, నిధితో పాటు స్కూటీపై ఓ యువకుడు కూడా ఉన్న విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అంజలి, నిధితో పాటు ఉన్న ఆ వ్యక్తి ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రెండు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా విచారిస్తున్నారు. వీటిలో మొదటి ఫుటేజ్ 7.7 నిముషాల నిడివి ఉంది. ఇది డిసెంబర్ 31 అర్ధరాత్రి వీడియో. అందులో స్కూటీపై అంజలి నిధి ఉన్నారు. ఓ యువకుడు స్కూటీ నడుపుతున్నాడు. మధ్యలో అంజలి కూర్చోగా...చివర నిధి కూర్చుంది. ఓ వీధి వద్ద స్కూటీని ఆపారు. వెంటనే నిధి కిందకు దిగి అంజలికి ఏదో ఇచ్చింది. తరవాత లోపలకు వెళ్లిపోయింది. అంజలి, ఆ యువకుడు మాత్రం అక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి అంజలి అదే వీధిలోకి తొందరగా వెళ్లిపోయింది. ఆ తరవాత యువకుడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంజలి ఇంటి వద్ద ఉన్న కెమెరాలోనే ఇదంతా రికార్డ్ అయిందని పోలీసులు తెలిపారు. ఓ మూడు నిముషాల తరవాత అంజలి బయటకు వచ్చింది. ఆ తరవాత ఆమె వెనక నిధి వచ్చింది. అప్పటికే ఓ చోట స్కూటీ పార్క్ చేసి ఉంది. మళ్లీ యువకుడు కనిపించ లేదు. అంజలి స్కూటీ నడుపుతుండగా...నిధి వెనకాల కూర్చుంది. మూడు నిముషాల తరవాత ఇదే వీధిలో అంజలి మృతదేహాన్ని కింద పడేసి వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మూడే మూడు నిముషాల్లోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. అసలు ఆ యువకుడు ఎవరు..? అని ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే...ఆ వ్యక్తి అంజలి ఫ్రెండ్ నవీన్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ యువకుడిని పోలీసులి విచారించారనీ సమాచారం. కానీ...ఆ మూడు నిముషాల్లోనే ఏం జరిగి ఉంటుందన్నది తేలాల్సి ఉంది.
కార్ ఓనర్ అరెస్ట్..
ఈ కేసుతో ఐదుగురి నిందితులతో పాటు మరి కొందరికీ సంబంధం ఉందని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. అయితే...ఇప్పుడు ఆరో వ్యక్తిని పట్టుకున్నారు. కార్ ఓనర్ అశుతోష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం ఐదుగురు నిందితులనూ ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో చిక్కు ముడులున్నాయి. అంజలి కార్ కింద చిక్కుకుందని తెలిసినా పట్టించుకోకుండా లాక్కెళ్లారని తన స్నేహితురాలు నిధి చెప్పింది. అయితే... ఈమె మాటల్లోనూ నిజమెంత అన్నది స్పష్టత రావడం లేదు. నిధి తల్లి కూడా అంజలిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. "కావాలనే వాళ్లు అంజలిపైకి కార్ ఎక్కించారని నా కూతురు చెప్పింది" అని నిధి తల్లి వెల్లడించారు. ఇది కచ్చితంగా హత్యేనని అంటున్నారు. తన కూతురునీ చంపేందుకు వాళ్లు ప్రయత్నించారని...అదృష్టవశాత్తు తప్పించుకుని వచ్చిందని అన్నారు. అయితే..పోలీసులు మాత్రం ఇది హత్య అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు.
Also Read: Paternity Leave: పురుషులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఫార్మా కంపెనీ, 12 వారాల పాటు పితృత్వ సెలవులు