Kamareddy Road Accident : రాంగ్ రూట్ ప్రాణం తీసింది, బైక్ ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి!
Kamareddy Road Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వెళ్తోన్న బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు.
Kamareddy Road Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ ప్రయాణం ముగ్గురి ప్రాణం తీసింది. ఒకే బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.
అసలేం జరిగింది?
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గద్ద గుండు తండా మూల మలుపు జాతీయ రహదారిపై బైక్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులలో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి గ్రామానికి చెందిన వారు ఇద్దరు ఉండగా అదే మండలానికి చెందిన గాంధీ నగర్ గ్రామానికి చెందిన మరొ యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ద్విచక్ర వాహనంపై పిట్లం నుంచి నిజాంసాగర్ వైపు రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా హైదరాబాద్ నుంచి దెగ్లూర్ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిద్ధిపేటలో ఘోర ప్రమాదం
సిద్దిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ కి చెందిన భార్యాభర్తలు సహా డ్రైవర్ మృతి చెందాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్లకు చెందిన తాండ్రపాపారావు లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం కరీంనగర్‌లో నివసిస్తున్నారు. ఆదివారం తన భార్య పద్మతో కలిసి ఓ ప్రైవేట్ కార్ రెంట్ కి తీసుకొని హైదరాబాద్ కి బయలుదేరారు. నాగుల మల్యాలకు చెందిన గుంటి ఆంజనేయులు అనే వ్యక్తిని డ్రైవర్‌గా నియమించుకున్నారు.
మల్లారం శివారులో గల మైసమ్మ గుడి సమీపంలోకి రాగానే ఎదురుగా ఒక లారీ రాంగ్ రూట్ లో వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిద్ధిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాంగ్ రూట్లో వచ్చి నిండు ప్రాణాలను బలిగొన్న డ్రైవర్ కనీసం ప్రమాదం జరిగిన విషయం పై కూడా మాట్లాడలేనంత మత్తులో తూలుతూ ఉన్నాడు.
నెల కిందట తండ్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరేళ్ళకి చెందిన తాండ్రపాపా రావు గతంలో స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో చాలాకాలంపాటు లెక్చరర్‌గా పనిచేశారు. ఆరేళ్ల కిందట రిటైర్మెంట్ తీసుకొని భగత్ నగర్‌లో సొంత ఇంటిలో భార్యతో కలిసి నివాసముంటున్నారు. పాపారావు కుమారుడు విదేశాల్లో సెటిలయ్యారు. అయితే పాపారావు తండ్రి సూర్యారావు గత నెల 5వ తారీఖున స్వగ్రామంలో మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించి రెండు రోజుల కిందట నెల మాసికం కూడా నిర్వహించారు. భార్యతో కలిసి తిరిగి ఇంటికి చేరుకున్న పాపారావు దంపతులు బంధువుల ఇంటికి వెళ్లడానికి హైదరాబాద్ బయలుదేరారు.