Surrogacy scam: మహిళల్ని ఇంట్లోనే పెట్టుకుని సరోగసి వ్యాపారం - పోలీసులకు చిక్కిన తల్లీ కొడుకులు !
Surrogacy Crime : సరోగసి కోసం మహిళల్ని ఇంట్లోనే పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వారిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ ఐవీఎఫ్ ఆస్పత్రుల ద్వారా వీరు జంటలను సంప్రదిస్తున్నారు.

Surrogacy scam in Jeedimetla: సృష్టి ఆస్పత్రి నిర్వాకం తర్వాత పోలీసులు సరోగసి పేరుతో చేస్తున్న అక్రమాలపై దృష్టి సారించి ఐవీఎఫ్ ఆస్పత్రుల వ్యవహారాలపై నిఘా పెట్టారు. తాజాగా ఇలా ఓ సరోగసి వ్యాపారం చేస్తున్న కుటుంబాన్ని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు కష్టాల్లో ఉన్న మహిళల్ని గుర్తించి సరోగసికి ఒప్పిస్తారు. తమ ఇంట్లోనే ఉంచి సరోగసి ద్వారా బిడ్డల్ని పుట్టించి వారికి డబ్బులు ఇచ్చి పంపేస్తారు. కొంత మంది నుంచి అండాలు సేకరించి వారికి డబ్బులిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ చిలుకలూరి పెట్ కు చెందిన లక్ష్మి రెడ్డి , ఆమె కుమారుడు నరేంద్ర రెడ్డి సుచిత్ర,పద్మా నగర్ లో నివాసం ఉంటున్నారు. సరోగసీ అండ్ ఎగ్ ట్రేడింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. వివిధ రాష్ట్రాల నుండి మహిళల్ని తీసుకువచ్చి లక్ష్మి రెడ్డి తన ఇంట్లో పెట్టుకుని,సరోగసీ IVF పద్దతి ద్వారా గర్భం దాల్చేలా చేసి పిల్లలు పుట్టిన తర్వాత పంపేస్తున్నారు. నిందితురాలి కుమారుడు నరేందర్ రెడ్డి జేఎన్టీయూ లో కెమికల్ ఇంజినీరింగ్ చదివాడు. తల్లికి తోడుగా ఈ అక్రమ క్లినిక్ నడపడంలో సహాయం చేస్తున్నాడు.
నిందితురాలు లక్ష్మి రెడ్డి పూర్వంలోనే ఎగ్ డోనర్,సరోగేట్ మదర్ గా అనుభవం ఉంది. ఆమె గతంలో ఎగ్స్ డొనేట్ చేశారు. అలాగే సరోగసి మదర్‌గా వేరే వారి పిల్లలను తన గర్భంలో మోసి వారికి అప్పగించారు. తర్వాత ఇతర మహిళలను సంప్రదించి అదే పని చేస్తున్నారు. ఇందు కోసం కొన్ని ఆస్పత్రులతో టచ్ లో ఉన్నారు. మాదాపూర్ లోని హెగ్డే, లక్స్ అనే రెండు ఆసుపత్రి లతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆయా ఆస్పత్రులకు వచ్చే దంపతులకు.. పిల్లలు పుట్టే చాన్స్ లేకపోతే.. సరోగసి మదర్ అవసరం అయితే.. వీరిని సంప్రదించేవారు. లక్ష్మిరెడ్డి ఆయా దంపతులకు సరోగసి మదర్ ను రెడీ చేసేవారు. ఇందు కోసం లక్షలు వసూలు చేసేవారు.
ఈ అక్రమ క్లినిక్ నిర్వహిస్తున్న నిందితులు అయిన (తల్లి కొడుకు)లక్ష్మి రెడ్డి,నరేందర్ రెడ్డి లను అరెస్ట్ చేశామని… నిందితుల దగ్గర నుంచి ₹6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు , సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కే షీట్లు ,5 స్మార్ట్‌ఫోన్లు, 1 కీప్యాడ్ మొబైల్ కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, BNS యాక్ట్ కింద కేసు కేసు నమోదు చేసి వీరికి సహకరించిన వారిని గుర్తిచే పనిలో ఉన్నామని తెలిపారు పోలీసులు. భారతీయ చట్టాల ప్రకారం కేవలం బంధువులు మాత్రమే సరోగసి మదర్ గా ఉండేందుకు అనుమతి ఇస్తాయి. వాణిజ్య పద్దతిలో డబ్బులు తీసుకుని సరోగసి మదర్ గా ఉండటం నేరం అవుతుంది. అందుకే ఇలాంటి సరోగసి పేరుతో ఎవరైనా వ్యాపారం చేస్తే.. పోలీసులు అరెస్టు చేస్తారు.





















