(Source: ECI/ABP News/ABP Majha)
Rajahmundry: రూ. 550 కోట్ల కుంభకోణం - రాజమండ్రి సెంట్రల్ జైలుకు జయలక్ష్మి బ్యాంకు నిందితులు
ది జయలక్ష్మి కో ఆపరేటివ్ సహకార బ్యాంకు పేరుతో రూ. 550 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Jayalakshmi Cooperative Scam in Kakinda: కాకినాడ జిల్లాలో సుమారు రూ.550 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ రాయవరపు విశాలక్ష్మి, బ్యాంకు ఎండీగా వ్యవహరిస్తున్న ఆమె భర్త రాయవరపు సీతారామాంజనేయులు, బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న జయదేవ్ మణిలను అరెస్ట్ చేసి కాకినాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు అక్కడి నుంచి మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు తన ఖాతాదారులనుంచి కోట్ల రూపాయలు మేర వసూళ్లు చేసి ఆపై బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వీరు ముగ్గురు ఏ1, ఏ2, ఏ3 గా ఉన్నారు. బ్యాంకు నిధులను ఎటువంటి గ్యారంటీలు లేకుండా ఇష్టానుసారంగా దారి మళ్లించారు అన్న అభియోగంపై పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదయ్యాయి. బాధితులు చాలా కాలం నుంచి ఆందోళనలు చేస్తుండగా దీనిపై సహకార సంఘ అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవాలు వెల్లడవంతో ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ, అమలాపురంలో ఆందోళనలు...
ది జయలక్ష్మి కో ఆపరేటివ్ సహకార బ్యాంకు పేరుతో కాకినాడ కేంద్రంగా కాకినాడ అమలాపురం, రాజమండ్రి ప్రాంతాలలో బ్యాంకుల నిర్వహణ ద్వారా కోట్లాది రూపాయలు డిపాజిట్లు రూపంలో సేకరించారు. ఖాతాదారులను నమ్మబలికి అధిక వడ్డీలు ఎరచూపి బోర్డు తిప్పేయడంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. 5 ఏళ్ల కాలానికి ఖాతాదారుల చెల్లించిన మొత్తం నగదు రెట్టింపు చేసి ఇస్తామని చెప్పారు. పలుమార్లు బ్యాంకుల ముందు ధర్నాల నిర్వహించిన ఖాతాదారులు కాకినాడ జిల్లా ఎస్పీకు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. కష్టపడి సంపాదించిన సొమ్ములు ఇలా బోగస్ బ్యాంకుల్లో జమచేసి మోసపోయామని బాధితులు వాపోతున్నారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న నిందితులను ఎట్టకేలకు సీఐడీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఏసీబీ వలలో చిక్కిన జగ్గంపేట డిప్యూటీ తహసీల్దార్
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండల డిప్యూటీ తహసీల్దార్. టేకు చెట్లు నరకడం కోసం ఎన్వోసీ సర్టిఫికెట్ తీసుకునేందుకు ఓ రైతు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ను సంప్రదించారు. అయితే సర్టిఫికెట్ ఇవ్వాలంటే చెట్టుకు రూ.300 చొప్పున మొత్తం రూ.16,000 డిమాండ్ చేశారు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్. దీని కోసం ముందస్తుగా రూ.3,000 తీసుకోగా మిగిలిన సొమ్ముకోసం పదే పదే ఒత్తిడి చేయసాగాడు. దీంతో రైతు డయల్ 14400 ద్వారా ఏసీబీ అధికారులను అశ్రయించాడు. రైతు ఇచ్చిన సమాచారం మేరకు మందస్తు ప్రణాళికతో ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో రైతు వద్ద నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా డిప్యూటీ ఎమ్మార్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారని ఏసీబీ అడిషనల్ ఏప్పీ సౌజన్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సౌజన్య వెల్లడించారు. ఈదాడుల్లో ఏసీబీ సీఐ పుల్లారావు, శ్రీనివాస్, డి. వాసుకృష్ణ పాల్గొన్నారు.