అల్వాల్‌లో పదవీ విరమణ పొందిన కొందరు మాజీ సైనికులు తమ కోటా మద్యం బాటిళ్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇది రోజురోజుకూ పెరిగిపోతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Defense Liquor Racket | ఆల్వాల్‌లో సైనిక కోటా మద్యాన్ని వ్యాపారంగా మార్చి అక్రమ విక్రయాలు సాగిస్తున్న మాజీ ఆర్మీ ఉద్యోగుల దందాపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ దాడులు చేసింది.

- ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ విక్రయాలపై ఎక్సైజ్ దాడులు.
- పదవీ విరమణ సైనికుల భార్యలు మద్యం అమ్మి, అరెస్టులు.
- మరో మహిళ ఇంటి నుండి 67 బాటిళ్లు స్వాధీనం, అరెస్టు.
హైదరాబాద్: సైనికులకు ప్రభుత్వం ఇచ్చే డిఫెన్స్ కోటా మద్యానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొందరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు వ్యాపార సరుకుగా మార్చేసి అక్రమ దందాకు తెరలేపారు. హైదరాబాద్ ఆల్వాల్ ప్రాంతంలో రోజురోజుకూ పెరిగిపోతున్న డిఫెన్స్ మద్యం బాటిళ్ల అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం మోపగా పలు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
ఆల్వాల్ ప్రాంతంలో ఆర్మీ/డిఫెన్స్ కోటా మద్యానికి సంబంధించి అక్రమ విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్మీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన కొందరు మాజీ సైనికులు తమ కోటాతో పాటు ఇతరుల కోటా కింద వచ్చే డిఫెన్స్ మద్యం సీసాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని తమ భార్యల ద్వారా స్థానికంగా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు.

ఈ తరహా వ్యవహారాలపై పక్కా సమాచారంతో దాడులు చేసిన ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మొత్తం 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న ఈ మద్యం విలువ సుమారు రూ. 2.11 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
మల్కాజిగిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్‌రావు నేతృత్వంలోని బృందం సరస్వతీనగర్ లోతుకుంట ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. అక్కడ నివాసముంటున్న రామాంజనేయులు, మన్యం నాగప్రసన్న దంపతుల ఇంట్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు 96 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. భర్త రామాంజనేయులు డిఫెన్స్ కేంటీన్ల నుంచి మద్యం బాటిళ్లను తెచ్చి ఇస్తే, ఆయన భార్య నాగప్రసన్న ఇంట్లోనే ఉంటూ వాటిని కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఈ ఘటనపై దంపతులిద్దరిపైనా కేసు నమోదు చేయగా, నాగప్రసన్నను అరెస్టు చేసి ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్‌రావు తెలిపారు.

మరో ఘటనలో ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని న్యూ బోయినిపల్లి సౌజన్య కాలనీలో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ (టీమ్-బి) సీఐ గణపతిరెడ్డి నేతృత్వంలో సిబ్బంది సోదాలు నిర్వహించారు. ముసిమి లెంక (39) అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆ మహిళను అరెస్టు చేసి ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ గణపతిరెడ్డి తెలిపారు.
Frequently Asked Questions
అల్వాల్ ప్రాంతంలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు వెలుగుచూశాయి?
అక్రమ మద్యం విక్రయాలలో ఎవరు పాలుపంచుకుంటున్నారు?
పదవీ విరమణ పొందిన మాజీ సైనికులు తమ కోటా మద్యం బాటిళ్లను తక్కువ ధరకు కొని, వాటిని తమ భార్యల ద్వారా స్థానికంగా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.
ఈ అక్రమ విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి మొత్తం 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 2.11 లక్షలు ఉంటుందని అంచనా.
ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారా?
లోతుకుంట ప్రాంతంలో నాగప్రసన్నను, న్యూ బోయినిపల్లిలోని సౌజన్య కాలనీలో ముసిమి లెంక అనే మహిళను అక్రమ మద్యం విక్రయాల కేసులో అరెస్టు చేశారు.
ట్రెండింగ్ వార్తలు























