Hyderabad News: ఉద్యోగం పేరుతో మహిళకు కుచ్చు- పదకొండు లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
Hyderabad News: ఉద్యోగం పేరుతో మహిళను మోసం చేసిన నేరగాళ్లు. ఏకంగా రూ.11.50 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.
Hyderabad News: ఉద్యోగాల పేరుతో మోసం, జాబ్ ఇప్పిస్తామని లక్షలు కాజేసిన సంస్థ.. ఇలాంటి వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఎన్ని వార్తలు వచ్చినా, వస్తున్నా.. కొంతమందిలో మార్పు రావడం లేదు. పోలీసులు, నిపుణులు అలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని, ట్రైనింగ్ కు ఎవరూ డబ్బులు తీసుకోరని చెబుతున్నా వారి మాటలు వినడం లేదు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ 11 లక్షల రూపాయలు మోసపోయింది.
సెక్యూరిటీ డిపాజిట్ కోసమంటూ..
హైదరాబాద్ కి చెందిన 45 ఏళ్ల మహిళకు ఉద్యోగం పేరుతో టెలిగ్రామ్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దానికి స్పందించిన ఆ మహిళకు వారి నుంచి ఫోన్ వచ్చింది. క్రిటికల్ థింకర్స్ కావాలని వారు చెప్పారు. మార్కెట్ లో విడుదల అవుతున్న ప్రాజెక్టుకి క్రిటికల్ థింకింగ్ అనలిటిక్స్ ద్వారా తాము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో ఎలా రిలీజ్ చేయాలన్నదానిపై ఉద్యోగం ఉంటుందని చెప్పారు.
అదంతా నిజమేనని నమ్మింది ఆ మహిళ. తనకు సరైన ఉద్యోగం వచ్చిందనుకుంది. ఆ మహిళ జాబ్ ఆఫర్ కి సరే అని చెప్పింది. తదుపరి ప్రొసీడింగ్స్ లో ట్రైనింగ్, సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ. 10వేలు డబ్బు కట్టాలని ఆ మహిళకు చెప్పారు. తను చెల్లించిన డబ్బంతా కూడా రిఫండ్ అవుతుందని నమ్మించారు. అలా విడతల వారీగా ట్రైనింగ్ అనే పేరుతో డబ్బు కట్టించుకున్నారు. అలా మొత్తం రూ. 11.50 లక్షలు ఆ మహిళకు కుచ్చు టోపి పెట్టారు. ఆ తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన నెట్ వర్కింగ్ ప్రాసెస్ మూసేయడంతో తను మోసపోయినట్టు ఆ మహిళ గ్రహించింది. పోలీసులు ఆశ్రయించింది.
ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి మోసాల నేపథ్యంలో ఉద్యోగాల పేరిట వస్తున్న ఇటువంటి మెసేజీలను, మెయిల్ లను గుడ్డిగా నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. సంస్థలేవీ ట్రైనింగ్ ఇచ్చినందుకు డబ్బులు తీసుకోవని, డబ్బు కట్టాలని అడిగితే అది కచ్చితంగా ఫ్రాడ్ అని గుర్తించాలని వారు చెబుతున్నారు. జాబ్ ఆఫర్ అంటూ మెసేజ్, కాల్, మెయిల్ రాగానే ముందుగా ఆ కంపెనీకి సంబంధించిన పోర్టల్స్ ను చూడాలని, వాటి చిరునామా, ఫోన్ల నంబర్లు సేకరించి కాల్ చేసి కనుక్కోవాలని.. అంతా సరిగ్గా ఉంటేనే అప్పుడు ముందుకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇలాంటి మోసాల్లో బాధితులుగా 70 శాతం కంటే ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. మోసపోయిన తర్వాత డబ్బు రావడం చాలా కష్టం కాబట్టి.. ముందే అప్రమత్తంగా ఉండాలని వారు అంటున్నారు. మోసపోకుండా ఉండాల్సిన బాధ్యత బాధితులదేనని వారు చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి వాటిల్లో మనకు తెలియకుండా మోసపోతే.. ఆ విషయాన్ని వీలైనంత త్వరగా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. నిజమైన సంస్థలేవి మన నుండి ఏ విధంగానూ డబ్బులు సేకరించవని ముందుగా ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన విషయమని వారు చెబుతున్నారు. అలాగే జాబ్ ఆఫర్ అంటూ వచ్చిన మెయిల్స్ లోని లింకులను తొందరపడి క్లిక్ చేయవద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మన కంప్యూటర్ లోకి వైరస్ చొరబడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.