Hyderabad: ఒక్క గ్రాముతో 20 మందికి కిక్ - ఇంట్లోనే కొత్త రకం డ్రగ్స్ తయారీ, సెటప్ చూసి అవాక్కైన పోలీసులు
Hyderabad Drugs: మత్తు పదార్థాల తయారీ కోసం అతను సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో వెతకడమే కాకుండా, ఉత్తరాదికి వెళ్లి డ్రగ్స్ వాడే విదేశీ పర్యటకులను కలిసి వాటి తయారీపై మరింత తెలుసుకున్నాడు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ యువకుడి విషయంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పట్టుబడ్డ వ్యక్తి శ్రీరామ్ స్వయంగా డ్రగ్స్ తయారు చేయడం కోసం ఏ పనులు చేశాడో తెలుసుకొని పోలీసులు సైతం అవాక్కయ్యారు. వీరి నుంచి 8 గ్రాముల డీఎంటీ డ్రగ్, తయారీ పరికరాలు, రెండు మొబైల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని ఇంటిని పరిశీలించిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన ల్యాబ్, అందులో ఉన్న పరికరాలు చూసి అవాక్కయ్యారు.
మత్తు పదార్థాల తయారీ కోసం అతను సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో వెతకడమే కాకుండా, ఉత్తరాదికి వెళ్లి డ్రగ్స్ వాడే విదేశీ పర్యటకులను కలిసి వాటి తయారీపై మరింత తెలుసుకున్నాడు. అలా ముడి సరకును ఆన్ లైన్ ద్వారా తెప్పించుకొని సొంతంగా డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీరామ్ బీటెక్ చదివి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. చదువుకునే రోజుల్లోనే అతను తాగుడు, సిగరెట్లు వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం దొరక్క ఆ చెడు అలవాట్లకు ఇంకా బానిసయ్యాడు. చివరికి తానే మత్తు మందు తయారు చేయాలని అనుకొని.. అందుకోసం సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో సెర్చ్ చేశాడు. హిమాలయాలు, రిషికేష్ తదితర ప్రాంతాలకు వెళ్లి విదేశీ పర్యాటకుల నుంచి డీఎంటీ తయారీ విధానం నేర్చుకున్నాడు. అందుకు కావాల్సిన ముడి సరకును ఆన్ లైన్ వెబ్ సైట్ల నుంచి కొనుగోలు చేశాడు.
మత్తు పదార్థాల తయారీకి ఆన్ లైన్‌లో దొరకని రసాయనాల కోసం తానొక కెమిస్ట్రీ విద్యార్థి అవతారమెత్తి షాపులకు వెళ్లి కొనేవాడు. ప్రాక్టికల్స్ కోసం అంటూ వాటిని కొనేవాడు. అతను అద్దెకు ఉంటున్న కొండాపూర్‌లోని తన ఇంటినే ప్రయోగశాలగా మార్చేశాడు. దాదాపు రెండేళ్లపాటు ప్రయోగాలు చేసి ఎట్టకేలకు మత్తు మందును తయారు చేశాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది. అయితే, అవి పనిచేస్తున్నాయా లేదా అనేది పరీక్షించాలనుకున్నాడు. తొలుత తనతో పాటు స్నేహితులపైనే ప్రయోగించుకుందామనుకున్నాడు.
ఒక గ్రాము మత్తు పదార్థం ద్వారా 20 మందికి కిక్కు వస్తుందని స్వయంగా తెలుసుకున్నాడు. ఇక విక్రయించడం ప్రారంభించాడు. తాను తయారు చేసిన డ్రగ్ ఆవిరి రూపంలో ఓ పరికరం నుంచి సేవించాలని వినియోగదారులకు చెప్పేవాడు. ఇతనికి పరిచయం అయిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో కస్టమర్ సర్వీసు ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న మరో యువకుడికి ఇది అమ్మాడు. క్రమంగా డిమాండ్ పెరగడంతో ఒక గ్రాము రూ.8 వేల చొప్పున అమ్మడం మొదలుపెట్టాడు. తాజాగా ఈ కేసులో మూల వ్యక్తి అయిన శ్రీరామ్‌తో పాటు ఇతని వద్ద కస్టమర్ గా ఉన్న దీపక్ అనే వినియోగదారుడిని నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు.