Hyderabad News: ప్రేమ వివాహం, ఆ వీడియోలను బయటపెడతానంటూ భార్యకు బెదిరింపులు!
Hyderabad News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కలిసున్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసి భార్యపై బెదిరింపులకు పాల్పడుతున్న ప్రబుద్ధిడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad News: నువ్వే ప్రాణమంటూ వెంటపడ్డాడు. ఒప్పుకునే వరకు ఆమె వెనకాలే తిరిగాడు. అతడికి తనంటే ప్రాణమని నమ్మిన ఆ యువతి అతడికి ఓకే చెప్పింది. ఇంకేముంది ఇద్దరు ఇరు కుటుంబాలకు విషయం తెలియకుండానే పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఇక్కడే మొదలైంది అసలు కథ. భార్యతో తాను ఏకాంతంగా కలిసున్నప్పుడు.. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. తాను చెప్పినట్లు విననప్పుడల్లా అంటే తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వనప్పుడల్లా వాటిని బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని అతగాడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
ప్రేమ అన్నాడు, నో అంటే చచ్చిపోతానని మాయ మాటలు
హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతానికి చెందిన ఓ 26 ఏళ్ల మహిళ నగరంలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తోంది. ఆమెకు 25 ఏళ్ల నిఖిల్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ తరచూ వెంటపడేవాడు. పెళ్లంటూ చేసుకుంటూ నిన్నే చేసుకుంటానని.. లేదంటే చచ్చిపోతానంటూ మాయ మాటలు చెప్పాడు. దీంతో అతడి ప్రేమ నిజమేనని నమ్మిన ఆ యువతి.. అతడితో పెళ్లికి ఒప్పుకుంది. ఇరుకుటుంబాలకు విషయం చెప్పకుండానే గతేడాది నవంబర్ లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల పాటు ఎవరి ఇంట్లో వారున్నారు. ఆ తర్వాత అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కలిసే ఉంటున్నారు. అయితే అతడు ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మద్యానికి కూడా బానిస అయ్యాడు.
డబ్బుల కోసం తరచుగా భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇప్పటికే 4 లక్షల రూపాయల వరకు బాధితురాలి నుంచి తీసుకున్నాడు ఇటీవల ఇద్దరూ కలిసున్న సమయంలో తీసిన వీడియోలు, ఫొటోలు చూపిస్తూ డబ్బులు అడుగుతున్నాడు. అడిగినన్న డబ్బులు ఇవ్వకపోతే.. ఆ వీడియోలను నెట్టింట పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రాణంగా ప్రేమించానని చెప్పిన వ్యక్తి ఇంత దారుణంగా మోసం చేయడాన్ని ఆ యువతి తట్టుకోలేకపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తూనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే ట్రాక్ పై తలపెట్టి మరీ ట్రాఫిక్ ఎస్సై ఆత్మహత్య!
నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై రమణ బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్కాజ్ గిరి పరిధిలోని మౌలాలి రైల్వే ట్రాక్ పై తలపెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అటుగా వెళ్తున్న కొందరు యువకులు రైల్వే ట్రాక్ పై మృతదేహం ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయింది ఎవరనే విషయం తెలుసుకునేందుకు మృతదేహం పాకెట్లలో ఆధారాల కోసం వెతకగా.. ఆయన పర్సు లభించింది. అందులో ఉన్న ఆధారల కారణంగా చనిపోయింది ట్రాఫిక్ ఎస్సై రమణగా గుర్తించారు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఎస్సై రమణ 2020 బ్యాచ్ కు చెందినవారు. అయితే ఎస్సై రమణ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం గురించి మాత్రం ఇంకా ఎలాంటి వివరాలు తెలియలేదు.