Swiggy Delivery Boy: కుక్కను చూసి భయపడి బంగ్లా పైనుంచి దూకేసిన ఫుడ్ డెలివరీ బాయ్!
Swiggy Delivery Boy: ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చన ఓ డెలవరీ బాయ్.. ఇంట్లో ఉన్న శునకాన్ని చూసి భయపడిపోయాడు. దాన్నుంచి తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకి ఆస్పత్రి పాలయ్యాడు.
Swiggy Delivery Boy: ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు.. ఆ ఇంట్లో ఉన్న కుక్కను చూసి భయంతో పరుగులు పెట్టాడు. దాని నుంచి తప్పించుకోవాలనే టెన్షన్ లో భవనం పైనుంచి దూకేశాడు. తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ యూసుఫ్ గూడలోని శ్రీరాంనగర్ కు చెందిన 23 ఏళ్ల మహమ్మద్ రిజ్వాన్ మూడేళ్లుగా స్విగ్గీలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6లోని లుంబిని రాక్ క్యాసిల్ అపార్ట్ మెంట్ లో ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అయితే మూడో అంతస్తులో ఆర్డర్ ఇచ్చేందకు వెళ్లగా.. తలుపు తట్టగానే ఇంట్లో ఉన్న జర్మన్ షఫర్డ్ శునకం మొరుగుతూ వచ్చింది. అది చూసి విపరీతంగా భయపడిపోయిన రిజ్వాన్ పరుగులు తీయడం మొదలు పెట్టాడు. భయంతో ఏం చేయాలో పాలుపోని అతడు... మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులతో పాటు 108 అంబులెన్సుకు సమాచారం అందంచారు.
రంగంలోకి దిగిన అంబులెన్స్ సిబ్బంది అతడిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతడిని ఆస్పత్రికి తరలించే వరకు యజమాని శోభన అక్కడే ఉన్నారు. అయితే శునకం యజమాని నిర్లక్ష్యం వల్లే రిజ్వాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడని అతడి సోదరుడు మహమ్మద్ ఖాజా తెలిపారు. ఈ క్రమంలోనే అతడిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేసిన యువకులు
చాలా కాలం క్రితం ఈ ఘటన హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు తాగిన మైకంలో ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేస్తుండటం చూసిన మరో డెలివరీ బాయ్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. వారిని వారించి తన తోటి డెలివరీ బాయ్ ను కాపాడటానికి యత్నించగా.. తాగిన మైకంలో ఉన్న ఆ ముగ్గురు యువకులు.. అడ్డుగా వచ్చిన ఆ వ్యక్తిపైనా దాడి చేశారు. ఇష్టారీతిగా కొట్టారు. ఆ యువకులు మరీ మృగాళ్ల లాగా దాడి చేస్తుండటంతో స్థానికులు కూడా వారిని ఆపేందుకు భయపడ్డారు. క్రమంగా స్థానికులు పెరగడంతో ఆ ముగ్గురు యువకులు భయపడ్డారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పరుగు అందుకున్నారు. డెలివరీ బాయ్ ను కొందరు యువకులు తాగొచ్చి భవానీ నగర్ చౌరస్తాలో కొడుతున్నారని తెలియగానే డెలివరీ బాయ్స్ అక్కడికి చేరుకున్నారు. పారిపోతున్న ఆ ముగ్గురు యువకులను వెంటాడి మరీ పట్టుకున్నారు.
తీవ్రంగా గాయపడ్డ డెలివరీ బాయ్..
స్థానిక పోలీస్ స్టేషన్‌లో తాగిన మైకంలో ఉండి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డ ఆ యువకులను పోలీసులకు అప్పగించారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ డెలివరీ బాయ్ కిరణ్ ని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తప్ప తాగి డెలివరీ బాయ్ ను కొట్టిన ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు చైతన్య పురి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన యువకుల్లో ఇద్దరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. వారిని అరెస్టు చేశారు.