Hyderabad: నిండు గర్భిణీని వేటకత్తితో నరికిన సోదరుడు - ఆ పని చేయడమే అసలు పాపమైంది!
అతను చంపాలనుకున్న వ్యక్తి అక్కడ లేకపోవడంతో అతని భార్య అయిన ఈమెను పొట్టనపెట్టుకున్నాడు. నిందితుడు హతురాలికి వరుసకు సోదరుడే కావడం ఇక్కడ విస్మయం కలిగిస్తోంది.
Hyderabad Kondapur Pregnant Woman Murder: హైదరాబాద్ లోని కొండాపూర్‌లో ఘోరమైన ఘటన జరిగింది. నిండు గర్భిణీ అని చూడకుండా ఓ వ్యక్తి వేట కొడవలితో ఆమెను దారుణంగా హతమార్చాడు. నిజానికి అతను చంపాలనుకున్న వ్యక్తి అక్కడ లేకపోవడంతో అతని భార్య అయిన ఈమెను పొట్టనపెట్టుకున్నాడు. నిందితుడు హతురాలికి వరుసకు సోదరుడే కావడం ఇక్కడ విస్మయం కలిగిస్తోంది. 10 రోజుల క్రితం కొండాపూర్ లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ కొండాపూర్ లోని జేవీజీ హిల్స్ డీఆర్ టవర్స్ లో రామక్రిష్ణ, స్రవంతి అనే భార్యా భర్తలు నివాసం ఉంటున్నారు. వెంకట రామక్రిష్ణ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం స్రవంతి 8 నెలల గర్భిణీ. వెంకటరామక్రిష్ణ పిన్ని కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తుంది. ఆమెకు రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం గ్రామానికి చెందిన కావూరు శ్రీరామక్రిష్ణతో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వెంకటరామక్రిష్ణ మధ్యవర్తిత్వం వహించాడు. అయితే, కొత్తగా పెళ్లైన రామక్రిష్ణ తన భార్య లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం కోసం వేధించేవాడు. భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ వేధించేవాడు దీంతో పెళ్లికి మధ్యవర్తిత్వం వహించిన వెంకట రామక్రిష్ణ బంధువులతో కలిసి వారి ఊరు వెళ్లి పంచాయితీ పెట్టించాడు.
దీంతో అప్పటి నుంచి శ్రీరామక్రిష్ణ, వెంకట రామక్రిష్ణపై కోపం పంచుకున్నాడు. పంచాయితీ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో లక్ష్మీ ప్రసన్న భర్త శ్రీరామక్రిష్ణ నుంచి వేరుగా ఉంటోంది. హైదరాబాద్ చందానగర్ లో ఉంటున్న ఆమె భర్త నుంచి వేధింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీరామక్రిష్ణను పిలిపించి నోటీసు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వరుసకు బావమరిది అయ్యే వెంకట రామక్రిష్ణను అంతం చేయాలని శ్రీరామక్రిష్ణ అనుకున్నాడు.
ఈ క్రమంలోనే ఈనెల 6న సాయంత్రం ఎర్రగడ్డలో ఓ వేట కొడవలి కొన్నాడు. కొండాపూర్ లో ఉన్న వెంకట రామక్రిష్ణ - స్రవంతి ఇంటికి వెళ్లి తలుపు కొట్టగా, వెంకట రామక్రిష్ణ ఇంట్లో లేడు. కుమార్తెను స్కూలు నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. స్రవంతి ఒంటరిగా ఇంట్లో ఉంది. శ్రీరామక్రిష్ణ చేతిలో వేటకొడవలి చూసిన ఆమె భయపడిపోయి గట్టిగా కేకలు వేసింది. దీంతో వేటకొడవలితో శ్రీరామక్రిష్ణ ఆమెపై వేటు వేశాడు. స్థానికులు, భర్త సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చనిపోయింది.
మధ్యవర్తిత్వం వహించి చక్కగా పెళ్లి సంబంధం కుదిర్చితే, అతను తమ కుటుంబంలో తీరని నష్టం కలిగించాడని బంధువులు వాపోతున్నారు. శ్రీరామక్రిష్ణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.