Hydeabad: భార్య జల్సాల కోసం దొంగగా మారిన భర్త! గోవా వెళ్లేందుకు చైన్ స్నాచింగ్!
Telangana News: అంబర్ పేట్ పోలీసులు ముగ్గురు చైన్ స్నాచర్లన పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు భార్య విలాసాలు తీర్చడం కోసం దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసలు వెల్లడించారు.
Hyderabad Chain Snatching News: హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అంబర్ పేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు తాము ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని ఈస్ట్ డీసీపీ గిరిధర్ రావ్ వివరించారు. జూన్ 19న సునీత్ కుమార్ ఓ మహిళ మెడలో గొలుసు దొంగతనం చేసినట్లు వెల్లడించారు. ఈ ముగ్గురు వ్యక్తులు గతంలో కూడా ఇవే పనులు చేస్తూ దొరికిపోయారని అన్నారు. నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి రెండు గోల్డ్ చైన్లు, ఒక స్కూటర్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
ప్రధాన నిందితుడు సునీత్ కుమార్ ఉప్పల్ కల్యాణ్ పురిలో ఉంటారని.. పోతంశెట్టి రవి అనే వ్యక్తి కాప్రాలో ఉంటారని, రాజేశ్ రాథోడ్ అనే వ్యక్తి ఈసీఐఎల్ గాయత్రి నగర్ లో క్రిష్ణా జువెల్లర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ నడుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.
భార్య విలాసవంతమైన జీవితం గడపాలని కోరడంతో సునీత్ కుమార్ చైన్ స్నాచింగ్‌లు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్నారని చెప్పారు.
దొంగతనం చేసిన ఆభరణాలు, విలువైన వస్తువులను నిందితులు ఎక్కడైనా తాకట్టు పెడితే ఆ తాకట్టు తీసుకున్న వారిపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. సెక్షన్ 411 కింద తాకట్టు తీసుకున్న వారిని కూడా అరెస్టు చేయాల్సి వస్తుందని తెలిపారు. నమ్మకస్తులు అయితేనే బంగారం కుదువకు తీసుకోవాలని వ్యాపారులకు పోలీసులు సూచించారు.
సైదాబాద్ పరిధిలో కాల్పులతో ఛేజింగ్
మరో ఘటనలో సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తున్న చైన్ స్నాచర్‌లను పట్టుకొనేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. స్థానిక శంఖేశ్వర్ బజార్‌లో చైన్ స్నాచర్ సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. యాంటీ డేకాయిటీ టీమ్ పోలీసులు శంఖేశ్వర్ బజార్ చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా బైక్ పై తిరుగుతున్న చైన్ స్నాచర్ అమీర్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. అతను పోలీసులను చూసి ప్రతిఘటించి ఎదురుదాడికి దిగడంతో.. పోలీసులు కాల్పులు చేయాల్సి వచ్చింది. అతను పారిపోయే ప్రయత్నం చేయగా.. చేజింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే లొంగిపోవాలని గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. చివరికి ఆ నిందితుడ్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.