(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad: హైదరాబాద్ వాళ్లంటే అదో మాదిరి ఇష్టం డార్లింగ్.. ఈ మాటకే పడిపోయారు.. సర్వం కోల్పోయారు..
ఒకటి కాదు రెండు కాదు…పదుల సంఖ్యలో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా హనీట్రాప్‌లో పడుతున్నారు. ఏది ప్రేమో…ఏది ఆకర్షణో…ఏది అవసరమో…ఏది ట్రాపో తెలుసుకోలేకపోతున్నారు. నిండా మునిగాక లబోదిబో మంటున్నారు.
పెళ్లైంది…ఇద్దరు పిల్లలున్నారు…. భర్త పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన ఆ మహిళ బుద్ధి పక్కదారి పట్టింది. సోషల్ మీడియాలో యువకులకు వల వేస్తూ మోసాలకు పాల్పడుతోంది. కొన్ని నెలలుగా హైదరాబాద్ యువకులనే టార్గెట్ చేస్తూ.. ప్రేమ పేరుతో వల వేస్తుంది…కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత.. పెళ్లి చేసుకుందామని నమ్మిస్తుంది. అప్పటి నుంచి అడిగిన ప్రతిసారి డబ్బులు ఇవ్వాలి.. లేదంటే అక్రమ కేసులు పెట్టి జైలు పాలుచేస్తానని హెచ్చరిస్తుంది. కేరళకు చెందిన ఈమె చేతిలో మోస పోయాడు హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు. ఇద్దరు పిల్లలు, భర్తతో జీవనం సాగిస్తూ... ఈ మోసాలకు పాల్పడుతోందన్న విషయం తర్వాత తెలిసిందని చెప్పాడు. భారీ మొత్తంసో డబ్బులు లాగిందని.. ఈ మహిళా చేతిలో మోసపోయానంటూ న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. స్పందించిన హెచ్చార్సీ నవంబర్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మాయలేడీ చేతిలో చాలామంది హైదరాబాద్ యువకులు మోసపోయారని చెప్పుకొచ్చాడు బాధితుడు.
యువకుల వీక్ నెస్ ని ఆసరాగా చేసుకుని కిలేడీలు రెచ్చిపోతున్న ఘటనలు ఇదే మొదలేం కాదు. గతంలోనూ ఇలాంటి మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎప్పటి సంగతులో ఎందుకు సరిగ్గా రెండు రోజుల క్రితం ఇంచుమించు ఇలాంటి కిలేడీ బాగోతం వెలుగుచూసింది. సోషల్ మీడియాలో యువతతో పరిచయం పెంచుకుని అశ్లీల వీడియోలు, ఫోటోలతో రెచ్చగొడుతుంది. ఒళ్లు మరిచి చాటింగ్ చేశారో ఆ తర్వాత తాటతీసేస్తుంది. తనతో జరిపిన చాటింగ్ ను బయటపెడతానని బెదిరించి అందినకాడికి డబ్బులు దండుకుంటుంది. ఇలా ఈమె చేతిలో మోసపోయిన ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె మోసాల చిట్టా బయటపడింది.
హైదరాబాద్ శివారులోని కొంపల్లి సినీ ప్లానెట్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఇటీవల ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అటువైపు మహిళ కావడంతో పరిచయం పెంచుకున్న యువకుడు కొంతకాలం వాట్సాప్ చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఫేస్ బుక్ లో ప్రెండ్స్ గా మారిన వీరిద్దరూ అక్కడ కూడా వ్యక్తిగత ఫోటోలు, అశ్లీల వీడియోలతో ఛాటింగ్ సాగించారు. యువకుడు కూడా రెచ్చిపోయి తన వ్యక్తిగత ఫోటోలు పంపాడు. ఇద్దరి మధ్య అశ్లీల వీడియో కాల్స్ కూడా జరిగాయి. ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన యువతి…ఆ యువకుడిని బెదిరించి పాతికవేలు దోచుకుంది. ఇంకా డబ్బులు అడగడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పరిచయాలతో జాగ్రత్తగా వుండాలని... తెలిసిన వారు అయితేనే స్పందించాలని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కిలేడీల ట్రాప్ లో పడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని…ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.