Hitech City MMTS Rail Accident : హైదరాబాద్ లో ఘోర ప్రమాదం, ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురి మృతి
Hitech City MMTS Rail Accident : హైదరాహబాద్ హైటెక్ సిటీ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు వనపర్తి వాసులుగా తెలుస్తోంది.
Hitech City MMTS Rail Accident : హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని మగ్గురు వ్యక్తులు మృతి చెందారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని మలుపు వద్ద వెనుక నుంచి వస్తోన్న ఎంఎంటీఎస్ రైలును గమనించకుండా ముగ్గురు వ్యక్తులు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. వారిని రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. మృతుల్లో ఒకరి వద్ద మద్యం సీసాలు గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు వనపర్తి వాసులుగా గుర్తించారు పోలీసులు.
భక్తులపైకి దూసుకెళ్లిన టెంపో
కర్ణాటకలో మద్యం మత్తులో ఓ డ్రైవర్ రోడ్డు పక్కన నిద్రస్తున్న వారిపై నుంచి వాహనాన్ని పోనిచ్చాడు. దైవ దర్శనానికి వెళ్లి ఆలయ ఆవరణలో నిద్రపోతున్న భక్తుల మీద నుంచి ఓ టెంపో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ భక్తుడు నిద్రలోనే కన్నుమూశాడు. కొప్పల్ జిల్లాలోని హులగి గ్రామంలోని హులిగెమ్మ ఆలయం ఆవరణలో నిద్రిస్తున్న భక్తుల బృందంపై నుంచి టెంపో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా నలుగురికి గాయాలయ్యాయి. మృతుడు కొప్పల్ జిల్లా కరటగి సమీపంలోని నందిహళ్లి గ్రామానికి చెందిన తిప్పన్నగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కొప్పల్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. టెంపో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో డ్రైవర్ బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
#Koppal: A person was killed after a tempo ran over a group of pilgrims sleeping on the premises of famous Huligemma temple in #Hulagi village of the district, police said. pic.twitter.com/1uIVMpze6P
— IANS (@ians_india) July 26, 2022
యూపీలో బస్సు ప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందారు. 16 మంది వరకు గాయపడ్డారు. కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్‌పుర్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. రెండు ప్రైవేట్ బస్సులు బిహార్ నుంచి దిల్లీకి వెళుతుండగా ఢీకొన్నాయి. ఓ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో వేగంగా వచ్చిన రెండో బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను లఖ్‌నవూ ట్రామా సెంటర్‌కు తరలించారు.