Geyser Explosion: హైదరాబాద్‌లో విషాదం - గీజర్ పేలి నవ దంపతులు దుర్మరణం
Hyderabad Geyser Explosion: బాత్‌రూమ్‌లో గీజర్ పేలడంతో నవ దంపతులు దుర్మరణం చెందారు. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్‌బాగ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ లోని లంగర్‌హౌస్ లో విషాదం చోటుచేసుకుంది. బాత్‌రూమ్‌లో గీజర్ పేలడంతో నవ దంపతులు దుర్మరణం చెందారు. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్‌బాగ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో భర్త డాక్టర్ కాగా, భార్య ఎంబీబీఎస్ చదువుతున్నారని సమాచారం. షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ విషాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన లంగర్ హౌస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
సయ్యద్ నిసరుద్దీన్ సూర్యాపేటలోని ఓ హాస్పిటల్‌లో డాక్టర్ గా చేస్తున్నారు. ఆయన కొన్ని నెలల కిందట ఉమ్మే మొహిమీన్ సైమాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మొహిమీన్ దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతోంది. ఈ దంపతులు లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్‌బాగ్‌లో నివాసం ఉంటున్నారు. సైమా తల్లిదండ్రులు అబ్దుల్ అహ్మద్, ఆయన భార్య టోలిచౌకిలోని మెరాజ్ కాలనీలో నివాసముంటున్నారు. గురువారం ఉదయం ఫోన్ చేయగా కూతురు, అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం మరోసారి ఫోన్ చేసినా ఏ రెస్పాన్స్ లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.
కూతురు, అల్లుడి నుంచి ఫోన్ కాల్ రాకపోవడం, తాము కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఖాదర్‌బాగ్ కు వెళ్లారు సైమా తల్లిదండ్రులు. కాలింగ్ బెల్ ఎంతసేపు కొట్టినా డోర్ తెరవలేదు. దీంతో వారి భయం రెట్టింపైంది. డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. ఇళ్లంతా వెతికినా కనిపించలేదని, చివరగా బాత్రూమ్ లోకి వెళ్లి చూసిన సైమా తల్లిదండ్రులు షాకయ్యారు. నిసరుద్దీన్, సైమాలు బాత్రూంలో చలనం లేకుండా పడి ఉన్నారు. గీజర్ పేలి వారు ప్రాణాలు కోల్పోయారని గ్రహించి కన్నీటి పర్యంతమయ్యారు.
ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం
అబ్దుల్ అహ్మద్ సమాచారం ఇవ్వడంతో లంగర్‌హౌస్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం చేయడానికి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దంపతుల దుర్మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ కారణంగా గీజర్ పేలి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు .