Fake Baba : దెయ్యం వదిలిస్తానని యువతికి వల, ఇప్పటికే ఏడు పెళ్లిళ్లు చేసుకున్న దొంగబాబా!
Fake Baba : దెయ్యం వదిలిస్తానని నమ్మించి యువతిని ట్రాప్ చేశాడో బాబా. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముహూర్తం టైంకి ముఖం చాటేశాడు. దీనిపై ఆరా తీస్తే బాబాకు ఏడు పెళ్లిళ్లు తెలిసింది.
Fake Baba : ఓ యువతికి దెయ్యం పట్టిందని నమ్మించిన దొంగ బాబా, పెళ్లి చేసుకుని రక్షించుకుంటానని చెప్పి మోసం చేశాడు. యువతి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అయింది. హైదరాబాద్ టోలిచౌక్‌కు చెందిన ఓ యువతి నెల్లూరులోని ఓ దర్గాకు చెందిన హఫీజ్ పాషా వద్దకు చికిత్స కోసం వెళ్లింది. యువతికి దెయ్యం పట్టిందని నమ్మించిన బాబా, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులను నమ్మించాడు. మూడేళ్లుగా యువతికి చికిత్స చేస్తున్నా నయంకాలేదు. కొన్ని రోజుల్లో యువతి చనిపోతుందని కుటుంబ సభ్యులను నమ్మించిన బాబా.. పెళ్లి చేసుకుని యువతి ప్రాణాలు కాపాడుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె బంధువులు బాబాతో పెళ్లికి ఒప్పుకున్నారు.
దొంగ బాబాకు ఏడు పెళ్లిళ్లు
దీంతో బాబాతో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఏర్పాటుచేశారు. ఈనెల 11న హైదరాబాద్ టోలిచౌక్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పిన బాబా ముఖం చాటేశాడు. అనుమానంతో యువతి బంధువులు బాబా బంధువుల సంప్రదించగా హెల్త్ బాగోలేదని చెప్పించాడు. బాబా ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి కుటుంబ సభ్యులు ఆరా తీయగా గతంలోనే అతడు అనేక మందిని పెళ్లి చేసుకున్నట్టు అసలు విషయం తెలిసింది. ఈ దొంగ బాబాపై నెల్లూరులోని పలు పోలీస్ స్టేషన్లలో 13 కేసులు నమోదు అయ్యాయని తెలిసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో హఫీజ్ పాషాపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఆ బాబా ఏడు పెళ్లిళ్లు జరిగినట్టు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లో అత్తిలి సత్తి
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఇటీవల దొంగ బాబా హల్ చల్ చేశాడు. మాయ మాటలు చెప్తూ ఇంట్లోకి వచ్చిన ఆ బాబా.. సదరు మహిళపై పసుపు, కుంకుమలు చల్లాడు. దీంతో మహిళ స్పృహ తప్పింది. ఈ క్రమంలోనే అతను చెప్పినట్లు నడుచుకుంది. మెడలో ఉన్న బంగారు చైన్ ను ఇచ్చేసింది. ఆ తర్వాత బాబా మెల్లగా అక్కడి నుంచి ఉడాయించాడు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రప్రస్థ కాలనీలో వరలక్ష్మి, రాము దంపతులు నివసిస్తున్నారు. రాము ఓ చిన్నపాటి వ్యాపారి. కాషాయ దుస్తులు ధరించిన బాబా వరలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెతో మాటలు కలుపుతూ పసుపు, కుంకుమలు చల్లాడు. దీంతో వరలక్ష్మి బాబా చెప్పినట్లు ఆడింది తన మెడలో ఉన్న గొలుసు తీసి బాబాకు ఇచ్చింది. గొలుసు తీసుకున్న బాబా మెళ్లగా బయటకు వెళ్లిపోయాడు. ఇదంతా జరుగుతున్నా ఆమెకు ఏమీ తెలియలేదు. వరలక్ష్మిపై మత్తమందు చల్లిన బాబా బురిడీ కొట్టించాడు. వరుసగా పక్కనే ఉన్న రెండిళ్లలోకి కూడా బాబా వెళ్లాడు. కానీ అక్కడ ఎవరూ దొంగ బాబా చేతిలో మోసపోలేదు. సకాలంలో మహిళ భర్త రావడంతో బాబా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇదంతా సీసీ కమెరాల్లో రికార్డు అయింది. అయితే సదరు మహిళ స్పృహలోకి రాగానే తన మెడలో ఉన్న చైన్ కనిపించట్లేదని చెప్పింది. వెంటనే వాళ్లు సీసీ టీవీ చెక్ చేశారు. జరిగినదంతా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు నేరాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. కాగా బురిడీ బాబాను ఎల్బీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంద్ర ప్రసతా కాలనీలో మహిళ మెడలో నుంచి మంగళ సూత్రాన్ని లాక్కెళ్లిన బురిడీ బాబాను నందనవనంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.