(Source: ECI/ABP News/ABP Majha)
Dammaiguda Girl Case : దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో అనుమానాలు, పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు!
Dammaiguda Girl Case : హైదరాబాద్ దమ్మాయిగూడ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తెలిపారు.
Dammaiguda Girl Case : హైదరాబాద్ దమ్మాయిగూడ చిన్నారి ఇందు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. ఈ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక లంగ్స్ లో నీరు చేరిందని, ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్థారించారు. చెరువులో నీరు తాగడం వల్లే బాలిక చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. బాలికకు పోస్టుమార్టం చేసే సమయంలో చిన్నారి మేనమామ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిన్నారి చెరువులో ఎలా పడిపోయిందన్న విషయం తెలియాల్సి ఉంది. దమ్మాయిగూడ చౌరస్తా వద్ద ఉద్రికత్త నెలకొంది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు రోడ్డుపై నిరసనకు దిగారు. పోస్టుమార్టం కాపీ తమకు ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. చిన్నారి మృతిపై స్పష్టత ఇవ్వాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందు మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబులెన్స్ ను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఇందు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ లోని దమ్మాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. గురువారం అదృశ్యమైన పదేళ్ల బాలిక శుక్రవారం ఉదయం చెరువులో శవంగా తేలింది. నిన్ననే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీశారు. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రి నరేష్ తో పాటు బడికి వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచి పెట్టి పుస్తకాలు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు పాఠాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. అయితే బాలిక వెళ్లిపోయిన విషయం తనకు తెలియగానే.. ఇందు తండ్రికి ఫోన్ చేసి ప్రిన్సిపల్ విషయం చెప్పారు. హుటాహుటిన బడికి వచ్చిన బాలిక తండ్రి చుట్టుపక్కల వెతికారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం నాలుగు గంటలకు కేసు నమోదు చేసుకొని ఇందూ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రమాదమా లేక హత్యా?
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపారు పోలీసులు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్తా వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియ రాలేదు. డాగ్ స్వ్కాడ్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఈరోజు ఉదయం మృతదేహం లభ్యం కావడంతో శవాన్ని బయటకు తీశారు. బాలికను ఎవరైనా హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ ఏరియాలో గంజాయి ముఠాలు, తాగుబోతులు ఎక్కువగా సంచరిస్తారని వారే ఏమైనా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఉంటే ఆధారాలు లభించేవని చెబుతున్నారు. బాలిక ఒక్కతే బయటకు వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దీన్ని బట్టి పోలీసులు బాలిక ఏమైనా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయిందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు.