Hyderabad Crime News: యువతితో పాటు ఆమె తమ్ముడిపై కత్తితో ప్రేమోన్మాది దాడి - సోదరుడి మృతి, నిందితుడు అరెస్ట్
Hyderabad Crime News: ఎల్బీ నగర్ యువతితో పాటు ఆమె తమ్ముడిపై ఓ ప్రేమోన్మాది దాడి చేయగా.. యువకుడు చనిపోయాడు. యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Hyderabad Crime News: హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 26 ఎళ్ల వయసుున్న శివ కుమార్ రామాంతపూర్ కు చెందిన సంఘవి గౌడ్ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు శివ కుమార్ తన ప్రేమ గురించి సంఘవితో చర్చించేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. అదే సమయంలో సంఘవి సోదరుడు చింటూ కూడా ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఎప్పటి నుంచో సంఘవి సోదరుడు చింటూకు, శివ కుమార్ కు మధ్య గొడవ జరుగుతోంది. ఈక్రమంలోనే ఇంటికి వచ్చిన శివ కుమార్.. సంఘవితో పాటు, చింటూను కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో సంఘవి తీవ్రంగా గాయపడగా.. ఆమె సోదరుడు చింటూ అక్కడికక్కడే చనిపోయాడు.
ఆమె వేసిన కేకలతో అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సంఘవిని బయటకు తీసుకొచ్చి నిందితుడు అయిన శివ కుమార్ ను గదిలో వేసి తాళం వేశారు. వెంటనే విషయాన్ని 100 డయల్ ద్వారా పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువతిని ఆస్పత్రికి తరలించారు. అలాగే రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
షాద్ నగర్ చెందిన అక్కా తమ్ముడు సంఘవి, చింటూ ఎల్బీనగర్ లో అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సంఘవి హోమియోపతి నాలుగో సంవత్సరం చదువుతుండగా... చింటూ బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు. కానీ ప్రేమ పేరుతో వేధించిన ఓ యువకుడి కారణంగా సంఘవి సోదరుడు ప్రాణాలు కోల్పోయాడు.