Hyderabad Crime News: అరకిలోమీటర్ పరిగెత్తి దొంగను పట్టుకున్న వృద్ధురాలు
Hyderabad Crime News: బ్యాంకులో ఉన్న ఓ వృద్ధ మహిళ నుంచి 50 వేల రూపాయలను తీసుకొని పారిపోయాడో దొంగ. విషయం గుర్తించిన సదరు మహిళ అరకిలోమీటర్ పరిగెత్తి మరీ అతడిని పట్టుకుంది.
Hyderabad Crime News: పట్టపగలు... అది కూడా అందరూ చూస్తుండగా... బ్యాంకులో ఉన్న ఓ వృద్ద మహిళ చేతిలో ఉన్న 50 వేల రూపాయల బ్యాగ్‌ను తీసుకొని పారిపోయాడో దొంగ. విషయం గుర్తించిన మహిళ అతడి వెంట పరుగెత్తింది. వృద్ధురాలే అయినా డబ్బు కోసం అర కిలోమీటర్ పరిగెత్తింది. చివరకు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించింది.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ ఘట్ కేసర్ ఠాణా పరిధిలో ఓ దొంగతనం జరిగింది. ఎదులాబాద్ కు చెందిన నర్సమ్మ పొదుపు సంఘం నాయకురాలిగా వ్యవహరిస్తోంది. రోజు వారీగా సంఘంలో జమ అయ్యే సభ్యులకు చెందిన 50 వేల రూపాయలను గురువారం రోజు ఘట్ కేసర్ పట్టణంలోని యూనియన్ బ్యాంకులో జమ చేసేందుకు వచ్చింది. ఆమెను గమనిస్తూ.. ఉన్న యువకుడు చేతిలో ఉన్న నగదు తీసుకొని పారిపోయాడు. నర్సమ్మ గట్టిగా కేకలు వేస్తూ పారిపోతున్న దొంగను సుమారు అర కిలోమీటర్ వరకు వెంటాడి పట్టుకుంది. జరిగిన విషయం చెప్పడంతో స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలే అయినప్పటికీ.. అర కలోమీటర్ పరిగెత్తి పట్టుకోవడంతో నర్సమ్మను పలువురు అభినందించారు. దొంగ అదుపులో ఉన్నారని, ప్రశ్నిస్తున్నామని క్రైమ్ విభాగం సీఐ జంగయ్య తెలిపారు.
వారం క్రితం హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్..!
హైదరాబాద్ మళ్లీ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. ఇటీవర వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీలో ఓ వృద్ధురాలి మెడలో నుంచి ఓ దుండగుడు బంగారపు చైన్ లాక్కెళ్లాడు. వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతుండగా బైక్ పై వచ్చిన దుండగుడు బైక్ ఆపి, వెనుక నుంచి వెళ్లి రెండు తులాల బంగారపు చైన్ లాక్కెళ్లాడు. ఈ దొంగతనం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆరు చోట్ల స్నాచింగ్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల తెలంగాణ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన చైన్ స్నాచర్లు వరంగల్ లో చిక్కారు. హైదరాబాద్ లో ఆరు చోట్ల స్నాచింగులు జరగడంతో తెలంగాణ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో నిఘా పెంచారు. పోలీసులు ఊహించినట్టుగానే కేటుగాళ్లు రైళ్లో పారిపోయేందుకు యత్నించారు. అప్పటికే రైల్వే స్టేషన్లలో నిఘా పెంచడంతో వరంగల్ జిల్లా కాజీపేటలో సినీఫక్కీలో పట్టుకున్నారు. ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కంత్రీగాళ్లు వరుసగా స్నాచింగులకు పాల్పడ్డారు. రాంగోపాల్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు మహిళల మెడలోంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లారు. వరుస చైన్ స్నాచింగులతో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. స్నాచర్లను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు రంగంలోకి దిగారు. చైన్ దొంగల కోసం హైదరాబాద్‌లోని అన్ని చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్‌లో పారిపోతుండగా వరంగల్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కాజీపేట రైల్వేస్టేషన్‌ను దొంగలను పట్టుకున్నారు.