Hyderabad Crime : భాగ్యనగరంలో బైక్ చోరులు, గ్యాంగ్ గుట్టురట్టు చేసిన శంషాబాద్ పోలీసులు
Hyderabad Crime : హైదరాబాద్ వరుసగా బైకులను దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. భాగ్యనగరంలో చోరీ చేసి నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ లలో బైకులు అమ్మేస్తున్నారు ఈ ముఠా.
Hyderabad Crime :హైదరాబాద్ లో బైక్ దొంగతనాలు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 50 లక్షల విలువైన 46 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరించారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ శంషాబాద్ SOT, శంషాబాద్ జోన్ పోలీసులు కలిసి బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారని తెలిపారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ముఠా పది నెలల నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో బైక్ ల దొంగతనాలు చేస్తున్నారు. బైక్ లు చోరీలకు సంబంధించి 44 కేసులు నమోదు అయ్యాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ముఠాలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారన్నారు.
రూ. 15 వేలకే బైక్
"ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు మహమ్మద్ అష్వాక్ అలియాస్ ఖబీర్ పాతబస్తీకి చెందిన వ్యక్తి. మదీన సెంటర్ లో సెల్స్ మేన్ గా పనిచేసేవాడు. సద్దాం అనే స్నేహితునితో కలిసి ఫస్ట్ హైదరాబాద్ లో బైకులు దొంగతనం చేశారు. మరో నలుగురిని కలుపుకుని మూడు కమిషనరేట్ ల పరిధిలో వరుసగా టూ వీలర్ లు చోరీ చేసేవారు. ఇద్దరు జువైనల్స్ ను కూడా గ్యాంగ్ లో చేర్చుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీలు చేస్తున్నారు. ఈ బైకులను వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డిలలో అమ్మేవారు. ఫైనాన్స్ కట్టని బైకులు అని చెప్పి అమ్మేస్తున్నారు. రూ.15 వేల నుంచి రూ.30 వేలకు బైకులను అమ్మేవారు. షాపింగ్ మాల్స్, షాపుల ముందు లాక్ చేయకుండా ఉన్న బైకులు చోరీ చేసేవారు. "- సీపీ స్టీఫెన్ రవీంద్ర
ఖరీదైన బైకులే టార్గెట్
హైదరాబాద్ లో ఖరీదైన బైక్ లను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఇటీవల అఫ్జల్ గంజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గుమ్మడి చక్రవర్తి తెలిపారు. ఈ ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో మగ్గురు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుల నుంచి 13 ఖరీదైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రూ.17 లక్షల విలువ చేసే 5 బజాజ్ పల్సర్, 7 రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్లు, ఒక యమహా స్పోర్ట్స్ బైక్ సీజ్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహబూబ్ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు డీసీపీ చక్రవర్తి తెలిపారు.
గత నెలలో రెండు బైకులు పోయాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు ఛేదించారు. ఈ ముఠాను గుర్తించి బీదర్ లో అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు ఆరుగురు కర్ణాటకలో నివాసం ఉంటున్నారు. అజార్, ఫేజిల్, మహునుడ్, సల్మాన్ బీదర్ కు చెందినవారు. ఈ ముఠాలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరంతా కర్ణాటకలో ఒకే ఏరియాలో ఉంటారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వచ్చి బైకులు చోరీ చేస్తు్న్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బైక్ పార్క్ చేసే విషయంలో యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. చోరీ చేసిన బైక్ లను తక్కువ ధరకు(రూ.30 వేలు) విక్రయిస్తున్నారు.