Hyderabad Crime: సోలార్ ప్లాంట్ పేరుతో సౌదీ స్నేహితులకు కుచ్చుటోపీ... ప్లాంట్ పెట్టకుండా రూ.12 కోట్లు కొట్టేశాడు
సోలార్ ప్లాంట్ పేరుతో ఏకంగా రూ.12 కోట్లు కొట్టేశాడో కేటుగాడు. సౌదీలోని స్నేహితుల ద్వారా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించాడు. సౌదీ నుంచి ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు.
అమాయకులను మోసం చేసేందుకు కేటుగాళ్లు కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి తరహా మోసం ఒకటి వెలుగుచూసింది. సోలార్ ప్లాంట్ పేరుతో ఏకంగా రూ. 12 కోట్లు వసూలు చేసి పరారైన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో ఒకరిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమనగల్ లో సోలార్ పవర్ ప్లాంట్ పెడతామని నమ్మించాడు ఖుర్షీద్ అహ్మద్. అంతే సౌదీలో ఉన్న బంధువు అల్తాఫ్ ను పెట్టుబడి పెట్టాలని కోరాడు. ఖుర్షీద్ మాటలు నమ్మిన అల్తాఫ్ తన స్నేహితులకు సోలార్ ప్లాంట్ గురించి వివరించి, అధిక లాభాలు వస్తాయని నమ్మించి రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించాడు. ప్లాంట్ నిర్మాణం త్వరలో జరుగుతోందని నమ్మించారు. రెండు సంవత్సరాలు గడిచాయి. పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియాలోని అల్తాఫ్ స్నేహితులు లాభాల కోసం నిలదీశారు.
Also Read: సెలవుల కోసం తోటి విద్యార్థులు తాగే నీళ్లలో విషం..అందరూ తాగేశారు ! తర్వాత ఏమయిందంటే ?
11 మందిని నమ్మించి రూ.12 కోట్లు వసూలు
తెలంగాణ నుంచి పర్చేజ్ అగ్రిమెంట్ వచ్చిందని, నకిలీ అగ్రిమెంట్ ను చూపించి నమ్మించే ప్రయత్నం చేశాడు ఖుర్షీ్ద్. అనుమానం రాకుండా కొన్నాళ్ల పాటు నెలనెలా మూడు లక్షల చొప్పున లాభం వచ్చిందంటూ నమ్మించి చెల్లించేవారు. ఇలా ఒకరు కాదు ఇద్దరుకాదు ఏకంగా 11 మందిని నమ్మించిన ఖుర్షీధ్ 11 మంది వద్ద నుంచి ఏకంగా రూ.12 కోట్లు సోలార్ ప్లాంట్ పెట్టుబడుల పేరుతో నొక్కేశారు. సౌదీ నుంచి తెలంగాణ వచ్చిన అల్తాఫ్ సోలార్ ప్లాంట్ ఎక్కడ అని నిలదీయడంతోపాటు ప్లాంట్ ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రదేశం వద్దకు అల్తాఫ్ ను తీసుకెళ్లాడు ఖుర్షీద్. ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో కేవలం స్ట్రక్చర్ మాత్రమే ఉండటం చూసిన అల్తాఫ్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. సౌదీతో తాను ఎవరినైతే నమ్మించి కోట్లాది రూపాయలు ప్లాంట్ పేరుతో వసూలు చేశాడో, వారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. పెట్టుబడి పెట్టిన బాధితులు ఆన్ లైన్ ద్వారా సౌధీ నుంచి అల్తాఫ్ పై హైదరాబాద్ సెంట్రల్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అల్తాఫ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు ఖుర్షీద్ పరారైయ్యాడు. ఖర్షీద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు సెంట్రల్ క్రైమ్ పోలీసులు.
Also Read: ఆర్‌ఎంపీ ప్రాక్టీసనర్... పాలిక్లీనిక్ ఓనర్... కథ అక్కడే అడ్డం తిరిగి అడ్డంగా బుక్కయ్యాడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి